Mahabubabad: దేశవ్యాప్తంగా మైనర్లపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి స్కూల్ కు వెళ్లే ఆడ పిల్లల వరకు వదలకుండా దారుణంగా హింసిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఉమేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని బయటకు పొక్కనీయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకునేందుకు కొందరు ‘పెద్ద మనుషులు’ రంగంలోకి దిగారు.
READ ALSO: Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!
బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చి, నిందితుడి నుంచి రూ. 3 లక్షలు ఇప్పించి, ఈ అమానవీయ ఘటనను డబ్బుతో సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ దారుణమైన సెటిల్మెంట్ గురించి గుర్తు తెలియని వ్యక్తులు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టారు. భయాందోళనలో ఉన్న బాలికను గుర్తించి, ఆమెకు ధైర్యం చెప్పి, సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు.
అధికారుల కౌన్సెలింగ్ అనంతరం, బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా స్పందించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఉమేష్‌తో పాటు, ఈ నేరాన్ని డబ్బుతో కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి, సెటిల్మెంట్ చేసిన నలుగురు పెద్ద మనుషులపై కూడా ఫోక్సో (POCSO) చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.