Collector Rizwan Basha: గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు అంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర, ధనుష్ హెచ్.పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పై అక్కడి యాజమాన్యంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా ప్రక్రియలో ప్రజలు అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ప్రతి సిలిండర్ బుకింగ్‌కు మధ్య 45 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
ఈ గడువు పూర్తికాకముందు మళ్లీ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఓటిపి నంబర్ రాదని, కాబట్టి ప్రజలు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు. గృహ అవసరాలకు గ్యాస్ బుకింగ్ సంబంధించి గతంలో వచ్చిన మెసేజ్లో ఉన్న తదుపరి బుకింగ్ తేదీ చూసుకుని ఆ తేదీకి మాత్రమే బుకింగ్ చేయాలని, గ్యాస్ బుక్ చేసిన వారికి సంబంధిత గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది నిర్దేశిత సమయంలోగా వినియోగదారుల ఇంటి వద్దకే వచ్చి సిలిండర్లను సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద గందరగోళం నివారించేందుకు ఓటిపి వచ్చిన వారికి ఒక లైన్ ఏర్పాటు చేసి సిలిండర్లను సరఫరా చేయాలన్నారు. అలాగే ఓటిపి రాని వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రతి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ హెల్ప్ డెస్క్ వద్ద వినియోగదారులకు బుకింగ్ స్టేటస్, ఓటిపి సమాచారం, తదుపరి బుకింగ్ తేదీ, తదితర వివరాలను అందించాలన్నారు.
గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి నిర్దేశిత గ్యాస్ బుక్ లోని కన్జ్యూమర్ నెంబర్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచే వినియోగదారులకు ఓటిపి వస్తుందని, మొబైల్ నెంబర్ మార్పులు అనుమతించబడవని తెలిపారు. ఇది బ్లాక్ మార్కెటింగ్ నివారణ కోసం తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. ప్రతి గ్యాస్ సిలిండర్‌కు ప్రత్యేక సీరియల్ నెంబర్ ఉంటుందని, సిలిండర్ దుర్వినియోగం లేదా ఇతరులకు మళ్లింపు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత వినియోగదారుడు మళ్లీ గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నప్పుడు డెలివరీ సమయంలో ఇదివరకు ఇచ్చిన సిలిండర్ ను నంబర్ సరిచూసుకుని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారిపై అవసరమైతే పోలీస్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 11 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాలకు సంబంధించి 1,76,366 , వాణిజ్య అవసరాలకు సంబంధించి 907 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 2815 గృహ అవసరాల గ్యాస్ బుకింగ్ లు జరుగుతున్నట్లు చెప్పారు. జిల్లాకు రోజుకు సుమారు 5000 గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, గ్యాస్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రజలు భవిష్యత్తులో గ్యాస్ కొరత రావచ్చేమోనని అనుమానాలతో ముందుగానే బుక్ చేసుకోవడం వలన ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం బారులు తీరాల్సి వస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు అపోహలను వీడి అనవసరంగా భయపడకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలోనే గ్యాస్ సిలిండర్ ల కోసం బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రదేశాల్లో సమగ్ర వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వినియోగదారులకు ప్రతి రోజు గ్యాస్ సిలిండర్ల సరఫరా, బుకింగ్స్, ఫిర్యాదులపై నివేదికలు సమర్పించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నది అగ్రహారం వద్ద ఉన్న ధనుష్ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ గోదామును సందర్శించారు. కేజీబీవీలు, గురుకులాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి స్వామి కుమార్, ఆయా గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులున్నారు.