Medical Graduates: హైదరాబాద్‌లోని కోఠి డిఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. ఇక వివరాల్లోకి వెలితే.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ను బలవంతంగా వారిని అరెస్ట్ చేసారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షకు గ్రాడ్యుయేట్స్ దిగారు.
అయితే గత 34 రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రాడ్యుయేట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎంఈ తమకు సమాధానం చెప్పాలని ఆమె కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించిన గ్రాడ్యుయేట్స్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తతలో పోలీసులకు గ్రాడ్యుయేట్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వైద్యశాఖ అధికారులు తమ పట్ల వివక్ష చూపుతున్నారని గ్రాడ్యుయేట్స్ ఆరోపణలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న తమకు నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్ మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులకు రూ.29 వేలు ఇస్తున్నారని.. ఒకే విధమైన వైద్య సేవలు అందిస్తున్నప్పుడు స్టైపెండ్‌లో ఇంత వ్యత్యాసం ఎందుకని గ్రాడ్యుయేట్స్ ప్రశ్నిస్తున్నారు. స్థానిక వైద్య పట్టభద్రులతో సమానంగా తమను గుర్తించి, స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!