ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడం లేదని ఆ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అయితే ఇటీవల కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీకి షాక్ తగిలినట్టయింది. ఏ ఇద్దరి మధ్య స్నేహం ఉందని బండి సంజయ్ అన్నారో అది తప్పని రుజువైంది. కేటీఆర్ పై కేసుని నిష్పక్షపాతంగా విచారణ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అదే సమయంలో కేసు పగడ్బందీగా ఉండేందుకు గవర్నర్ అనుమతిని ముందుగానే కోరారు. అదేదో కేటీఆర్ కి రేవంత్ రెడ్డి చేసిన సాయం అన్నట్టుగా మాట్లాడిన బండి సంజయ్, ఇప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది.
రహస్య స్నేహితులు..
తెలంగాణలో రాజకీయ రహస్య స్నేహితుల వ్యవహారం భల్ చమత్కారంగా ఉంటుంది. కాంగ్రెస్ దృష్టిలో బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహితులు. బీఆర్ఎస్ వాదనలో కాంగ్రెస్-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఫ్రెండ్షిప్ ఉందనేది బీజేపీ వాదన. అయితే ఈ మూడింటిలో కాస్తో కూస్తో నమ్మదగిన వేలిడ్ పాయింటి కాంగ్రెస్ వద్దే ఉంది. బీజేపీ-బీఆర్ఎస్ తమ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకోడానికి లోపాయికారీగా కలసి పనిచేస్తున్నాయనే వాదనను ప్రజలు కూడా నమ్ముతున్నారు.
తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటోంది. తమకంటే బలంగా కాంగ్రెస్ మారకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ తో కలసి గోతులు తవ్వింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర శాఖను బలహీన పరిచే ఉద్దేశంతో పార్టీ పదవుల్లో మార్పులు జరిగాయి. పార్టీ టికెట్ల కేటాయింపు కూడా వారి వ్యూహాన్ని బట్టబయలు చేసింది. బీజేపీ సపోర్ట్ తో బీఆర్ఎస్ చెలరేగిపోతుందని అనుకున్నారు కానీ మొదటికే మోసం వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ని చావుదెబ్బకొట్టింది. దీంతో బీజేపీకి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ ని దెబ్బకొట్టడం కంటే బీఆర్ఎస్ ని తొక్కిపెట్టడమే బెటర్ అని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారేందుకు బీజేపీ ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బండి సంజయ్ వంటి నేతలు కేంద్రం ఆడే ఆటలో పావులుగా మిగిలిపోవడం విశేషం.
బండి సంజయ్ సీరియస్ గా మాట్లాడినా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో నవ్వులుపూయిస్తుంటాయి. కేటీఆర్-రేవంత్ రెడ్డి ఎంత బద్ధ శత్రువులో అందరికీ తెలుసు. అలాంటిది వారిద్దరి మధ్య స్నేహం ఉందని చెబుతుంటారు బండి సంజయ్. ఇక పాలిటిక్స్ లో జబర్దస్త్ జోకులు పేలుస్తూ, సినిమావాళ్లకి వార్నింగ్ లు ఇస్తూ మరింత కామెడీ పంచుతుంటారాయన.
ఆ పని చేస్తే బెటర్..
కేసీఆర్ కి ఎలాగూ ఆరోగ్యం బాలేదు, కేటీఆర్ త్వరలో జైలుకెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ టైమ్ లో బీజేపీ కాస్త సీరియస్ గా బీఆర్ఎస్ పై దృష్టిసారిస్తే కీలక నేతలు ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పార్టీ అని ముద్రపడింది కాబట్టి, ఎలాగూ కేసీఆర్ ఫ్యామిలీలోనే ఎవరో ఒకరు ఆ పార్టీపై పెత్తనం కోరుకుంటారు. కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ మరింత పలుచన అయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి టైమ్ లో తెలంగాణలో బీజేపీ పలపడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బండి సంజయ్ లాంటి నేతలు ఈ వాదననైనా నమ్ముతారో లేదో చూడాలి.
Also Read: ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి సతీమణి