Formula Scandal Case: హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కేసులో ఓ అంకం ముగిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగుర్ని ఏసీబీ విచారించింది. చివరగా శనివారం ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ డైరెక్టర్ అనిల్‌కుమార్‌ని దాదాపు మూడుగంటలపాటు విచారించి అనేక వివరాలు సేకరించింది. విచారణ తర్వాత మరోసారి పిలుస్తామని ఏసీబీ చెప్పడంతో సరేనన్నారు అనిల్‌కుమార్.
తెలంగాణలో ఫార్ములా ఈ రేసు కేసు క్లయిమాక్స్‌కి చేరింది. ఈ కేసులో మొత్తం నలుగుర్ని విచారించింది ఏసీబీ. గతంలో అనిల్ కుమార్‌కు గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. శనివారం ఏసీబీ కార్యాలయానికి ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు అనిల్ కుమార్. మధ్యాహ్నం రెండున్నర గంటలకు చేరుకున్న ఆయనను సాయంత్రం ఐదున్నర వరకు విచారించి వివరాలు సేకరించింది.
ఫార్ములా ఈ కారు రేస్ స్పాన్సర్‌గా ఎందుకొచ్చారు? మధ్యలో మిడిల్‌డ్రాఫ్ ఎందుకయ్యా రు? గతంలో రేస్ నిర్వహించిన అనుభవం లేకున్నా ఒప్పందం చేసుకోవడానికి కారణాలేంటి? 9వ సీజన్ రేస్ ఒప్పంద ప్రకారం చెల్లించాల్సిన డబ్బుల్లో 30 శాతం మాత్రమే ఎందుకు చెల్లించారు? మిగతా డబ్బులు ఎవరు చెల్లించారు?
రేస్ నుంచి స్పాన్సర్ గా తప్పుకుంటున్నట్టు గత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? 9వ సీజన్ నిర్వహణలో భారీ నష్టాలు రావడంతో చెల్లించలేదని అనిల్ కుమార్ వెల్లడించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం నుండి సరైన సహకారం లేకపోవడం వల్లే రేస్ నుంచి తప్పుకున్నానని అనిల్ చెప్పినట్టు తెలుస్తోంది. గ్రీన్ కో కంపెనీ నుండి రూ. 41 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సమకూర్చారని అనిల్‌ను ప్రశ్నించింది ఏసీబీ.
ALSO READ: మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ.. కీలక నేతలపై బులెట్ల వర్షం..
ఫార్ములా ఈ రేసులో ప్రమోటర్ గా ఉండబోతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ప్రమోటర్ గా మిమ్మల్ని ఆహ్వానించిందెవరు? రేసు ప్రారంభానికి ముందు ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలను ప్రారంభించారా? అప్పటి మంత్రి కేటీఆర్-మీకు మధ్య జరిగిన సంభాషణ ఏంటి? అని అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ఫార్ములా రేసు తొలి సెషన్‌కు సంబంధించి ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన 90 కోట్ల రూపాయల ఫీజు ఏస్ అర్బన్ డెవలపర్స్ నుంచి రుణం రూపంలో తీసుకోవడంపై వివరాలు సేకరించారు.
అన్ని పార్టీలకు ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చామని చెప్పారట అనిల్ కుమార్. ఆనాటి అధికారులు, మంత్రికి చెప్పిన తర్వాతే తాము రేసు నుంచి తప్పుకున్నామని వివరించారట. ఇప్పటివరకు నలుగురి నుంచి సేకరించిన వివరాలను విశ్లేషించే పనిలోపడ్డారు అధికారులు. మళ్లీ వారికి పిలుపు ఉంటుందా? ఈ కేసు ఇంకా లోతుగా విచారణ జరిపేందుకు ఎవర్నైనా అదుపులోకి తీసుకుంటారా? అనేది వెయిట్ అండ్ సీ.