IAS Transfers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల ట్రాన్స్ ఫర్స్ ఇప్పుడు సెక్రటేరియట్ లో హాట్ టాఫిక్ గా మారాయి. ఏ ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలుసుకున్నా.. ట్రాన్స్ ఫర్స్ ముచ్చటపైనే చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయట. అంతేగాక “తదుపరి జాబితాలో ఎవరి పేరు ఉందో? ఏ క్షణంలో ఏ బదిలీ ఆర్డర్ వస్తుందో?” అని ఇండియన్ ఇడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అధికారులు ఆందోళన చెందాల్సిన సిచ్వేషన్ నెలకొన్నది.
రాష్ట్రంలో డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అంటే గడిచిన దాదాపు 28 నెలల్లో పరిపాలనా యంత్రాంగంలో మునుపెన్నడూ లేనంత వేగంగా బదిలీల పర్వం కొనసాగుతోంది. దాదాపు 23 సార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేసినట్లు ఆయా అధికారుల్లోనే చర్చంశనీయమైంది. జిల్లా కలెక్టర్ల నుంచి సెక్రటరీ స్థాయి వరకు ట్రాన్స్ ఫర్ల టాఫిక్ పైనే డిస్కషన్ చేసుకుంటున్నారు. కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు ఈ అంశంపై విస్తృతంగా చర్చించుకోవడం విశేషం.
సాధారణంగా ఒక ఉన్నతాధికారికి ఒక శాఖ , జిల్లా బాధ్యతలు అప్పగిస్తే, అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పూర్తి స్పష్టత రావడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. కానీ ప్రస్తుత పరిపాలనలో అధికారులు ఒక సీట్లో కూర్చుని, ఆ శాఖపై పట్టు సాధించే లోపే మరో కొత్త బదిలీ ఉత్తర్వులు చేతికి అందుతున్నాయనే వాదన వినిపిస్తుంది.దీనివల్ల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అధికారులకు కష్టంగా మారుతోందని, నిర్ణయాల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని సచివాలయ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది.
Also read: ఓట్ల కోసం వందల అవతారాలా? చంద్రబాబుపై రాచమల్లు ఫైర్!
ఈ బదిలీల ప్రభావం జిల్లాలను శాసించే కలెక్టర్ల నుంచి రాష్ట్ర స్థాయి విధానాలు రూపొందించే సెక్రటరీల వరకు అందరిపైనా కనిపిస్తోంది. కీలకమైన రెవెన్యూ, మున్సిపల్ శాఖ, పోలీస్ కమీషనరేట్లు, జీహెచ్ఎంసీ వంటి విభాగాల్లో సైతం అతి తక్కువ కాలంలోనే అధికారులు మారారు. ఉదాహరణకు జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్ విభాగాల్లో, అలాగే మల్కాజ్గరి, సైబరాబాద్ పరిధుల్లో పదే పదే జరిగిన మార్పులు ఇందుకు నిదర్శనం. సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, హరిచందన దాసరి, ఇలంబరితి తదితర అధికారుల బదిలీలు బ్యూరోక్రసీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
తరచూ బదిలీలు జరగడం వల్ల ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాల క్షేత్రస్థాయి పర్యవేక్షణ దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక కలెక్టర్ ఒక జిల్లాలో ప్రజా సమస్యలపై స్పందన ప్రారంభించి, వాటిపై ఒక అవగాహనకు వచ్చేలోపే బదిలీ అయితే, కొత్తగా వచ్చే అధికారి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్లో గొలుసుకట్టు అంతరాయం ఏర్పడి, ప్రజా పనులు నత్తనడకన సాగే అవకాశం ఉంది.అంతేగాక అధికారులు కూడా మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సీరియస్‌గా ఫోకస్ పెట్టలేని పరిస్థితులు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
తప్పిదాలు, నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తప్పించడంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. సీరియస్‌గా, ఫోకస్ట్‌గా పనిచేస్తున్న ఉన్నతాధికారులను కూడా పదే పదే షప్లింగ్ చేయడం వలన ప్రభుత్వానికే నష్టమని స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ ఆఫ్ ది రికార్డులో తెలిపారు. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం, వేగవంతమైన నిర్ణయాల కోసం బదిలీలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఇది కొంత గందరగోళానికి దారితీస్తోందనేది వాస్తవం. నిరంతర బదిలీల వల్ల అధికారులలో ‘స్థిరత్వం’ లోపించి, బాధ్యతాయుతంగా పని చేయడంలో వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ప్రజా పరిపాలన సజావుగా సాగాలంటే అధికారులకు ఒక పోస్టింగ్లో కనీస కాలపరిమితి ఇవ్వడం అత్యంత అవసరమని మేధావులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు.
Also read: ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. ఏడాది పొడవునా ఫ్రెస్ మామిడి పండ్లు తినొచ్చు.. ఎలాగంటే?