KTR: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని,అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం మాత్రమే కాదని, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా వెల్లడిస్తున్నారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ పీఎం మోడీ సైతం రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో లేదా రాజకీయ వేదికలపై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని, ఆరోపణల్లో వాస్తవం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై రాజకీయ విమర్శలు చేసుకోవడం కాకుండా, వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గతంలో ఈడీ దాడులు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో, విచారణ ఎక్కడికి చేరిందో ప్రజలకు స్పష్టత లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి రూ.5–6 లక్షల వంటి చిన్న మొత్తంలో సాయం పొందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది నిబంధనలు, షరతులు విధిస్తోందని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం రూపొందించిన పథకాల ప్రయోజనాలు పొందేందుకు సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్యుడి అవసరాలను పట్టించుకోకుండా, అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా పాలన కాదన్నారు.
Also read: హైదరాబాద్ ల్యాండ్ ఓనర్లకు షాకింగ్ న్యూస్.. హెచ్‌ఎమ్‌డీఏ, టీడీఆర్‌లలో సంచలన మార్పులు!
ప్రజల కోసం సీఎం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పుకోవడం కాకుండా,ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంపద, భూములు, ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రజల నిధులు ప్రజల ప్రయోజనాలకే వినియోగించాల్సి ఉండగా, వాటిని కుటుంబం, బంధువులు, అనుచరుల ప్రయోజనాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించాలని, అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయ, కుటుంబ ప్రయోజనాలకు పాలనను పరిమితం చేస్తే ప్రజలు తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించడంతో పాటు, బాల్య వివాహాలను అరికట్టడంలో, ఆడబిడ్డలు చదువుకు దూరం కాకుండా చూడటంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. అలాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేస్తోందన్నారు. కేసీఆర్ కిట్‌ను రద్దు చేశారని, కల్యాణలక్ష్మిని నిర్వీర్యం చేస్తున్నారని, షాదీ ముబారక్‌ను పక్కన పెట్టారని, రైతు బీమాను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.తమ హక్కులు, గౌరవం కోసం ధైర్యంగా నిలబడిన నల్సార్ విద్యార్థులకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
Also read: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం కాదు.. మీ ఆత్మగౌరవం: సీఎం రేవంత్!