Gouravelli Project: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి తీరే బాధ్యత తనదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఏ చిన్న జాప్యం జరిగినా దాని బాధ్యత కూడా తనదేనని అన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న వారు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీలు ఇచ్చినా ఎందుకు పూర్తి చేయలేకపోయారో మాజీ ఎమ్మెల్యే సతీష్‌బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.237 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి గతంలో ఏర్పడిన సమస్యలపై ప్రజలు న్యాయపోరాటం చేశారని మంత్రి తెలిపారు. గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా రాజకీయ విమర్శలు చేసే వారు గుర్తించాలని సూచించారు. గౌరవెల్లిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
Also read: రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?
హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, 250 పడకల ఆసుపత్రి, పీజీ మెడికల్ కాలేజీ, తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, హుస్నాబాద్–కరీంనగర్, అక్కన్నపేట–హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారులు, కొత్తచెరువు–పల్లెచెరువు పునరుద్ధరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి కూడా జరుగుతోందని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, విద్య, వైద్యం, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని మంత్రి సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాజకీయ విమర్శలకు దిగడం సరికాదన్నారు.
హుస్నాబాద్ ప్రజలకు రాజకీయ ఆరోపణలు, విమర్శలు అవసరం లేదని.. అభివృద్ధి కావాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో చేయలేకపోయిన పనులను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందన్నారు. “గౌరవెల్లి పూర్తి చేసే బాధ్యత నాదే.. పూర్తి చేయకపోయినా ఆ బాధ్యత కూడా నాదే. హుస్నాబాద్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చివరి వరకు కృషి చేస్తా.” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Also Read: ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!