నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరిచే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పటి వరకు భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు “మై జీహెచ్ఎంసీ” యాప్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉండేది. అయితే, అందరికీ సులభంగా అందుబాటులో ఉండే, వేగవంతమైన విధానం అవసరమన్న అవసరాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ తాజాగా ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను ప్రారంభించింది.
కాల్ చేస్తే చాలు..
ఈ కొత్త వ్యవస్థ ద్వారా, నగరంలోని ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న భవన నిర్మాణ వ్యర్థాలు, కావడం, జివిపి పాయింట్ల వద్ద పేరుకుపోయిన చెత్త వంటి సమస్యలను తక్షణమే ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ ద్వారా ఫోటోలు, లొకేషన్ వివరాలతో కలిపి వాటిని 81259 66586 అనే నంబర్‌కు పంపితే, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త వాట్సాప్ సేవ ప్రారంభించిన విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. ప్రజల సహకారం వల్లే పరిశుభ్ర నగర లక్ష్యం సాధ్యమవుతుందని, అందరూ ఈ సేవను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సాంకేతికతను ఉపయోగించి పౌరుల సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడం గానీ, ఈ వాట్సాప్ సౌకర్యం ముఖ్యపాత్ర పోషించనుంది.
సమస్య చెబితే చాలు
ఇప్పటికే నగరంలోని పలుచోట్ల ప్రజలు ఈ సేవను ఉపయోగించి తమ ప్రాంతాల్లోని సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి మంచి స్పందన కూడా లభించింది. పౌరులు తమ మొబైల్‌లో నుంచే సమస్యను వివరించగలిగే ఈ సదుపాయం ద్వారా నగరం పరిశుభ్రంగా ఉండే అవకాశం మరింతగా పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతతో వ్యవహరించి, ఈ వాట్సాప్ నంబర్ ద్వారా సమస్యలను అధికారులకు తెలియజేస్తే, నగరం శుభ్రంగా ఉండటమే కాకుండా, అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కలుగుతుంది. ప్రజల భాగస్వామ్యం, అధికారుల స్పందన – రెండూ కలిస్తేనే మన నగరం నిజంగా స్మార్ట్ సిటీ అవుతుంది.