GHMC Issues: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్ వ్యవస్థీకరించిన తర్వాత జీహెచ్ఎంసీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం డిసెంబర్ రెండో వారం నుంచి గత ఫిబ్రవరి 10వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగిన జీహెచ్ఎంసీ ఫిబ్రవరి 11 నుంచి మూడు ముక్కలుగా పునర్విభజించిన సంగతి తెల్సిందే. కోర్ అర్బన్ రీజియన్ లో విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థల నుంచి విలీనమైన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో మూడు ముక్కలుగా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు జీహెచ్ఎంసీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు బదిలీలయ్యారు.
దీంతో జీహెచ్ఎంసీలో ఒక్కసారిగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటంతో ప్రస్తుతమున్న 30 సర్కిళ్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను ఒక్కో అధికారికా మూడు సర్కిళ్లను అప్పగించినట్లు తెలిసింది. కొన్ని సర్కిళ్లలో ఈ బాధ్యతలను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ), మరి కొన్ని సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లకు, మరి కొన్నింటిలో సూపరింటెండెంట్లకు అప్పగించినట్లు సమాచారం. మూడు సర్కిళ్ల ఈ ఆఫీసులను కూడా వారికి కేటాయించారు. దీంతో వారు ఎపుడు ఏ సర్కిల్ లో విధులు నిర్వహిస్తున్నారో తెలియక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దశాబ్దాల కాలం క్రితం పేర్లు లేకుండా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్న వారు, ఇంటి పేరు లేకుండా తీసుకున్న వారు, ఇంటి పేరును సింగిల్ అక్షరంతో పెట్టి తీసుకున్న వారు ఇపుడు సర్టిఫికెట్ల కోసం సర్కిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది.
కొన్ని సర్కిళ్ల జారీలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తటంతో ఏకంగా దరఖాస్తుదారులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్కిల్ ఆఫీసుల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సిన వింగ్ సిబ్బంది ఓ రింగ్ ల మారి, దరఖాస్తుదారులను లంచాల కోసమే ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. మూడు సర్కిళ్లలో ఒకే సూపరింటెండెంట్ ఆ సర్టిఫికెట్ల జారీని పర్యవేక్షిస్తున్నందున ఒకే చోట ఎక్కువ సేపు విధులు నిర్వర్తించకపోవటంతో దరఖాస్తుదారులకు అందుబాటులో ఉండటం లేదని తెల్సింది. ముఖ్యంగా దరఖాస్తుదారులు కలిసినపుడు సాఫ్ట్ వేర్ లో లోపాలున్నాయని, నెట్ సరిగ్గా రావటం లేదని, స్టడీ సర్టిఫికెట్లు తీసుకురావాలని, ఆధార్ కార్డులో తప్పులున్నాయన్న కొర్రీలు పెడుతూ చివరకు దరఖాస్తుదారుడు బేజారై, తన నోటితో తానే ఏమైనా ఫార్మాల్టీలుంటే పూర్తి చేస్తానని చెప్పేవరకు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పని పరిస్థితులు నెలకున్నట్లు కొందరు దరఖాస్తుదారులు వాపోతున్నారు.
Also read: తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!
ఇంట్లో సంభించిన సాధారణ మరణాలకు సంబంధించి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చనిపోయిన వ్యక్తిని స్మశానవాటికలో కననం చేయటమో, దహనం చేయటమో గానీ నిర్వహించినట్లు స్మశానవాటిక రసీదు తీసుకెళ్లినా, డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సర్కిల్ సిబ్బంది చొరవ చూపటం లేదని మరి కొందరు దరఖాస్తుదారులు వాపోతున్నారు. స్మశానవాటిక నిర్వాహకులు ఇచ్చిన స్లిప్, మృతి చెందిన వ్యక్తి ఆధార్ కార్డు తో రక్త సంబంధీకులు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ మరణం గురించి పూర్తి వివరాలు ఆరా తీసేందుకు, దరఖాస్తుదారుడు దరఖాస్తులో ఇచ్చిన సమాచారాన్ని ఫీల్డు లెవెల్ లో సరి చూసుకునేందుకు సర్కిల్ సిబ్బంది పంఛనామా నిర్వహించాల్సి ఉంటుంది.
కానీ పంఛనామా నిర్వహించేందుకు వచ్చే సదరు సిబ్బంది దరఖాస్తుదారుడికి ముందుగా ఫోన్ చేసి, రావల్సి ఉండగా, ముందస్తు ఎలాంటి ఫోన్ చేయకుండానే నేరుగా వచ్చి ఇరుగుపొరుగు వారిని డెత్ గురించి వివరాలు తెల్సుకుని, ఈ మరణం ఇంట్లో సంభవించింది కాదన్న విషయం తేలినందున మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నట్లు పలువురు దరఖాస్తుదారులు వాపోయారు. ఆ తర్వాత చేతులు తడిపిన తర్వాత తెల్సిన వారిని ఇద్దరు, ముగ్గుర్ని ఆధార్ కార్డులు తీసుకుని వస్తే అపుడు పారదర్శకంగా పంఛనామా నిర్వహించి, సర్టిఫికెట్ కోసం సిఫార్సు చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.
Also Read: ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!