GHMC: తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో : కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్ణణ స్థానిక సంస్థల విలీనంతో దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించి నెల రోజులు గడుస్తున్నా, కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఇంకా కనీస వసతులు కూడా కల్పించలేదు. గత నవంబర్ 25వ తేదీ తర్వాత పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత గత నెల 11వ తేదీన మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెల్సిందే. కొత్తగా ఏర్పాటు చేసిన రెండు కార్పొరేషన్ల కమిషనర్లు, అదనపు కమిషనర్ల మినహా కింది స్థాయి అధికారులు ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారన్నది సామాన్యులకు క్లారిటీ లేకుండా పోయింది.
కొత్తగా ఏర్పాటైన రెండు కార్పొరేషన్లకు ఆగమేఘాలపై అధికారుల బదిలీలు, నియామకాలను చేపట్టినా, తగిన సంఖ్యలో కంప్యూటర్ ఆపరేటర్లు లేకపోవటంతో దాని ప్రభావం కార్పొరేషన్ల ఆదాయం, పరిపాలన వ్యవహారాలపై తీవ్రంగా పడుతున్నట్లు తెలిసింది. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయాన్ని తార్నాకలోని హెచ్ఎండీఏ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేయటంతో అక్కడి అధికారులు, సిబ్బందికి కాస్త వెసులు బాటుగా ఉన్నా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది. ప్రస్తుతం కమిషనర్ ఆఫీసు కోసం మాదాపూర్ లోని న్యాక్ భవనంలోని రెండో అంతస్తును కేటాయించినా, అక్కడ కూడా తాత్కాలిక ఆఫీసుల ఏర్పాటు పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడి ఆఫీసులో కమిషనర్ తో పాటు ఇతర విభాగాల అధిపతులకు తాత్కాలిక ఛాంబర్లను ఏర్పాటు చేశారు.
Also Read: Allu Arjun: మరోసారి మంచి మనసు చాటుకున్న ఐకాన్ స్టార్.. కాకినాడ జిల్లా వాసికి ఆర్థిక భరోసా?
దీంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ప్రస్తుతం మణి కొండలోని గత పట్టణ స్థానిక సంస్థ ఆఫీసులోనే విధులు నిర్వహిస్తుండగా, అక్కడ గదులు సరిపోకపోవటంతో ఏ స్థాయి అధికారి ఎక్కడ కూర్చోని విధులు నిర్వర్తించాలన్నది అయోమయం, గందరగోళంగా తయారైనట్టు సమాచారం. అదనపు కమిషనర్ స్థాయి మినహా మిగిలిన కింది క్యాడర్ స్థాయి అధికారుల్లో చాలా మందికి మణి కొండ ఆఫీసులో ప్రత్యేక ఛాంబర్లంటూ లేకపోవటం, ఒకే గదిలో ఇద్దరు అధికారులు కూర్చుండేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఒక్కోసారి సీట్ల కోసం అధికారుల మధ్య కొట్లాటలు జరుగుతున్నట్లు సమాచారం. ఆఫీసు విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవటంతో కొందరు అధికారులు ఫీల్డు లెవెల్ విధులకే పరిమితమవుతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం మాదాపూర్ న్యాక్ భవనంలో కొనసాగుతున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదిక సొంత భవనాన్ని సమకూర్చుకునేందుకు స్థానిక కలెక్టర్ ఆధ్వర్యంలో స్థలాన్వేషణ మొదలైనట్టు తెలిసింది. సైబరాబాద్ పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విలువ ఎంత? అన్న ప్రాతిపదికన స్థలాన్వేషణ కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం న్యాక్ భవనంలో కేటాయించిన రెండో అంతస్తును కూడా ఏడాది పాటు వినియోగించుకునేలా కేటాయించినట్లు తెలిసింది. అంతలోపు సొంత ఆఫీసు భవనాన్ని సమకూర్చుకునే దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రభుత్వం కార్పొరేషన్ కు సూచించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా స్థలాలను గుర్తించి, ఏడాది లోపు కార్పొరేషన్ కు సొంత భవనాన్ని సమకూర్చుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ప్రస్తుతం తార్నాక హెచ్ఎండీఏ భవనంలోనే కొనసాగిస్తూ, భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఆఫీసులను ఎక్స్ టెన్షన్ చేసుకోవాలని మున్సిపల్ శాఖ భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Film industry: ఆయన వల్లే 16 సినిమాలు కోల్పోయా.. నరకాన్ని అనుభవించలేకపోయాను.. వడివేలుపై నటి కామెంట్!