GHMC: స్వేఛ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్ణణ స్థానిక సంస్థల విలీనంతో దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించటంతో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో అవసరానికి తగిన స్థాయిలో ఉద్యోగులు లేకపోవటంతో పని భారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాత జీహెచ్ఎంసీ(GHMC) వివిధ విభాగాల వారీగా ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తుండటంతో ఇలాంటి సేవలను కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇలాంటి సేవలనే అందించేందుకే మూడు కార్పొరేషన్లుగా విభజించామని అధికారులు చెబుతున్నా, ప్రస్తుతం కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు నియమించిన, కేటాయించిన సిబ్బందితో సాధ్యమయ్యేలా లేవు.
ముఖ్యంగా గతంలో 650 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తీర్ణంతో కొనసాగిన జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో పరిధి ఏకంగా సుమారు 2 వేల 53 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కానీ విలీన పట్టణ స్థానిక సంస్థల్లో గతంలో జీహెచ్ఎంసీ తరహాలో వివిధ విభాగాల వారీగా పౌర సేవలు నిర్వహణ లేదు, ఇంజనీర్లే శానిటేషన్, స్ట్రీట్ లైట్ల నిర్వహణ వంటి ఇతరత్ర సేవలందించే వారు. విలీనానంతరం ఈ పట్టణ స్థానిక సంస్థల్లో కూడా జీహెచ్ఎంసీ తరహాలో సేవలందించాలని భావించినా, ఆ దిశగా కొత్తగా సిబ్బంది నియామకం గానీ, కేటాయింపులు గానీ జరగలేదు. కానీ కొత్తగా ఏర్పడిన జోన్లకు రెవెన్యూ విభాగం నుంచి అధికారులను నియమించి, వారికి జోనల్ స్థాయి బాధ్యతలను అప్పగించారే తప్పా, ఫీల్డు లెవెల్‌లో సేవలందించేందుకు వివిధ విభాగాల వారీగా ఉద్యోగులు, సిబ్బంది నియామకం ఇంకా చేయలేదు.
Also Read: Medak Municipality: ఢిల్లీలో కయ్యం గల్లీలో స్నేహం.. ఇదేం విచిత్ర రాజకీయం: పద్మ దేవేందర్ రెడ్డి
జీహెచ్ఎంసీలోకి పట్టణ స్థానిక సంస్థ విలీనం, పునర్విభజన, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విభజన వంటి కీలక ప్రక్రియలు జరుగుతున్నపుడు, అంతకన్నా ముందు జీహెచ్ఎంసీలో విధులు నిర్వహించిన సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, మరో 24 వేల మంది ఔట్ సోర్స్ కార్మికులను, మరో 700 నుంచి 800 మంది కంప్యూటర్ ఆపరేటర్లను మూడు కార్పొరేషన్లకు విభజించారు. దీంతో మూడు కార్పొరేషన్లలో ఎక్కువ విస్తీర్ణం, జోన్లు, సర్కిళ్లుగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీలోని పలు ముఖ్యమైన విభాగాల్లో సిబ్బంది కొరత నెలకొంది. కనీసం ఉద్యోగులకు బదిలీలపై ఆప్షన్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా మూడు కార్పొరేషన్లకు బదిలీ చేయటంపై ఇప్పటికే పలు యూనియన్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెల్సిందే. ఇక అధికారుల ప్రస్తావనకు వస్తే ఒక్కో ఆఫీసర్ రెండు నుంచి మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు జోనల్ కమిషనర్లకు అదనంగా అదనపు కమిషనర్ల బాధ్యతలను కూడా కట్టబెట్టడంతో వారు ఎపుడు ఎక్కడ ఉంటున్నారో తెలియక ప్రజలే గాక, వారి పై స్థాయి అధికారులు కూడా అయోమయనానికి గురవుతున్నారు.
ఆఫీసర్ల తరహాలోనే కింది స్థాయి ఉద్యోగులు సైతం రెండు, మూడురకాల బాధ్యతలు నిర్వహిస్తూ వత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు కొందరు ఉద్యోగులు డైలీ 120 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిసింది. హయాత్ నగర్ కన్నా దూరం నివాసముంటున్న ఓ శానిటరీ జవాన్ మోతీనగర్ లో విధులు నిర్వహిస్తూ, డైలీ 120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కొద్ది రోజుల క్రితమే అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తాను రిటైర్డు కు దగ్గరలో ఉన్నానని, తన ఆరోగ్యం బాగా లేదని, తనను హయత్ నగర్ సర్కిల్ కు బదిలీ చేయాలని సదరు జవాన్ రెండేళ్ల నుంచి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నా, కన్సీడర్ చేయటం లేదని తెలిసింది. ఈ రకంగా చాలా మంది ఉద్యోగులు పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ కు, శంషాబాద్ నుంచి మల్కాజ్ గిరికి డైలీ రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులెదుర్కొంటున్నట్లు తెలిసింది.
Also Read: Gopalapuram Politics: గోపాలపురంలో కలకలం రేపుతున్న జనసేన ఇంచార్జ్ ఆరోపణలు