Gopalapuram Politics: ప్రశ్నిస్తామన్న జనసేన పార్టీ నేతలే, అవినీతి ఆరోపణలపై ఇదేంటని ప్రశ్నిస్తే లీగల్ నోటీసులతో భయపెట్టిస్తున్నారంట.. గోపాలపురం జనసేన ఇంచార్జి సువర్ణరాజు (Suvarnaraju)పై వస్తున్న ఆ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరద బాధితుల సాయం బొక్కేశారని సువర్ణరాజుపై ఆరోపణలు వచ్చినా, నిజాయితీ గల పార్టీ పాతివ్రత్యం నిరూపించుకోలేకపోతుందంట.. అంటే ఇంకెవ్వరూ కాడె మోసేవారు లేక జనసేన అధిష్టానం అతన్నే పట్టుకుని వేలాడుతుందా? ప్రజల నుండే కాదు, జనసైనికుల పరంగా విమర్శలు ఎక్కువ అవుతున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
తూర్పుగోదావరిజిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఎన్ని జాకీలు పెట్టినా జనసేన మాత్రం లేచే ప్రసక్తి కనబడడంలేదట. కార్యకర్తలు ఎంత తపన పడుతున్నా, స్థానిక జనసేన ఇంచార్జిగా ఉన్న సువర్నరాజు చేసే తప్పులు క్యాడర్ ను కూడా వెంటాడుతూనే ఉన్నాయట. రాబోయే స్థానిక ఎన్నికల్లో అయినా గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పరువు దక్కించుకోవాలని జెండా మోసిన కార్యకర్తలు ఉవ్విళ్లూరుతుంటే, వలస నేతల చేతకాని పెత్తనంతో పార్టీ పునాదులు కదిలిపోతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. కూటమిలోని తెలుగుదేశం పార్టీ(TDP) ఓవైపు దూసుకెళ్తుంటే, అదే అధికార భాగస్వామి జనసేన మాత్రం తమ నియోజకవర్గంలో లేచి నిలబడలేకపోతోందంటూ జనసైనికులు, వీరమహిళలూ మదనపడిపోతున్నారట. దాంతో పార్టీ పెద్దలు తాజాగా గోపాలపురం నియోజకవర్గంపై దృష్టిపెట్టి, ద్విసభ్య కమిటీ ఏర్పాటుచేయడం కరెక్టంటూ అధిష్టానానికి సూచనలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి గోపాలపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న దొడ్డిగర్ల సువర్ణరాజు మాజీ వైసీపీ నాయకుడు. అసలు ఆయన్ను ఎప్పుడు, ఎవరు ఇన్ ఛార్జ్ గా నియమించారో తమకు తెలీయదంటూ క్యాడర్ గగ్గోలు పెడుతోంది. అయినా గతి లేక గుడ్డెత్తి చేలో పడ్డట్టు అతన్నే ఫాలో అయిపోతున్నారట. అధిష్టానం ఆయనకు అలాంటి బాధ్యతలేమీ అప్పగించలేదని, కొందరు నాయకులు తమ మండలాల్లో, తమ గ్రామాల్లో కమిటీలు వారికి వారే వేసేసుకుంటున్నారట. దీనికి నిదర్శనంగా దేవరపల్లి మండలంలో పార్టీ కమిటీలను స్థానిక నాయకులు నియమించుకున్నారంట. ఇక, ద్వారకాతిరుమల మండలంలో అయితే, ఎవరికి వారే, యమునా తీరే అన్నట్లు జనసేన పరిస్థితి తయారైంది. అటు నల్లజర్ల మండలంలోనూ విభజించు పాలించు అన్నరీతిలో ఇంచార్జ్ వ్యవహారం నడుస్తుంది. మిత్రపక్షాలపై, వలస నేతలపై ఉన్న ప్రేమ, జనసేన జెండా మోసిన వారిపై ఇన్ ఛార్జ్ కు లేదంటూ సొంత పార్టీవారే పెదవి విరుస్తున్నారట. ఇక, నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురం మండలంలో, ఏనాడూ పార్టీ యాక్టివిటీస్ కూడా లేకపోవడం విడ్డూరం.
Also Read: Road Incident: కడపలో ఘోర ప్రమాదం.. మద్యం మత్తులో డ్రైవర్ జనాలపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లో
జనసేన క్యాడర్ అంతా, ఇలా తలోదిక్కూ వెళ్లిపోవడానికి, నైరాశ్యంలో మునిగిపోవడానికి సవాలక్ష కారణాలున్నప్పటికీ, తిరిగి తిరిగి వెంటాడుతున్న వరదసాయం పాపం వారిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందంట. గతంలో బెజవాడను బుడమేరు వరద ముంచెత్తిన సందర్భంలో వరదసాయం నిమిత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వరద బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరించగా, గోపాలపురం నియోజకవర్గంలో జనసైనికులు సేకరించిన విరాళాలు మాత్రం, ప్రభుత్వానికి వెంటనే చేరకపోవడమే ఈ పరువు నష్టానికి కారణమైందట. ఎంత మంది మొత్తుకుంటున్నా, మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వెళ్లినా కూడా నెలల తరబడి వరదసాయం పై పారదర్శకత లేకపోవడం, ఆఖరికి సేకరించిన దాదాపు 18 లక్షల రూపాయల విలువైన బియ్యం బస్తాలు కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత, బియ్యం ఇస్తే పాడైపోయే అవకాశం ఉందని tama నాయకుడు మార్కెట్ లో విక్రయించారనీ, విక్రయించిన సొమ్ము అంతా స్వయంగా పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రభుత్వానికి ఇచ్చేందుకు వేచిచూస్తున్నారంటూ కొంతకాలం కవర్ చేసుకుంటూ వచ్చారు అయన అనుచరులు. కడాన, జరగాల్సిన నష్టం జరిగాక, మొన్నీమధ్యనే వరద సాయం తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పగించేసినట్లు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే, వరదసాయం వచ్చిన దాంట్లో 50 శాతమైనా ఇచ్చారా, లేదా? అనే సందేహాలు అటు ప్రజలతో పాటు, కొందరు జనసైనికులను కూడా వెంటాడుతున్నాయి.
ఈ విధంగా, చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లు ఒకదాని తర్వాత ఒక ఆరోపణలు జనసేన ఇన్ ఛార్జ్ సువర్ణరాజుపై వస్తుంటే, ఆ విషయాన్ని ప్రశ్నించినవారిపైనే తిరిగి కేసులు పెడతామంటూ బెదిరింపులు, లీగల్ నోటీసులు కూడా ఇచ్చేస్తున్నారట ఆ వలస నేత. అదేంటి ప్రశ్నించడమే మా హక్కు.. అంటూ జనంలోకి వచ్చిన జనసేన పార్టీ, తప్పుచేసిన వారిని ప్రశ్నిస్తే, తిరిగి కేసులు పెట్టేదాకా వెళ్లి బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ, పౌర సంఘాలు సైతం విమర్శిస్తున్నాయట. అసలు, ఇంత జరుగుతుంటే, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఎందుకు స్పందించరు? జిల్లా నేతలు, రాష్ట్ర నేతలూ, గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ని దెబ్బతీస్తున్న పరిణామాలపై ఎందుకు రియాక్ట్ అవ్వరు?, ఈ నేరాలు., ఘోరాలు., జనసేన అధిష్టానానికి తెలియవా.. అని జనాలు గుసగుసలాడుతున్నారట… మరి ఇప్పటికైనా అధినేత పవన్ కళ్యాణ్ గోపాలపురంపై దృష్టిపెడతారా? తీవ్ర అసంతృప్తిలో ఉన్న జనసైనికులకు స్థానిక సంస్థల ఎన్నికల ముందు బూస్ట్ ఇచ్చేలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారా., లేదా…? కనీసం జిల్లా అధ్యక్షుడైనా నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో మాట్లాడేది ఎప్పుడు అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారాయి.
Story by: Apparao, Big Tv
Also Read; Thorrur Municipality: ఉత్కంఠగా మారిన తొర్రూరు మున్సిపల్ రాజకీయం.. ఇక అందరి చూపు అటువైపే..!