Transport Scam: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఎక్కువ జనాభాకు అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, పౌర, అత్యవసర సేవలందించే బల్దియాకు బదలాయింపు ఫీవర్ పట్టుకుంది. అధికారులు, సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించే వివిధ విభాగాలు హైడ్రాకు బదలాయించటంపై కొందరు అధికారులు తెగ బాధపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు చేపట్టే సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడువున్న నాలాల్లోని పూడికతీత పనులను, వర్షం కురుస్తున్నపుడు సహాయక చర్యలు చేపట్టేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను సమకూర్చే బాధ్యతలను సర్కారు గతేడాది నుంచి హైడ్రాకు అప్పగించిన సంగతి తెల్సిందే.
తాజాగా నిత్యం అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు బయట పడే జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు విభాగాన్ని కూడా హైడ్రాకు అప్పగించే దిశగా కసరత్తు మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ట్రాన్స్ పోర్టు విభాగంలో తరుచూ డీజిల్, స్పేర్ పార్ట్స్ స్కామ్ లు వెలుగుచూడటంతో పాటు గడిచిన కొద్ది రోజులుగా పలు అక్రమాలు కూడా వెలుగులోకి రావటంతో వీటిపై సర్కారు ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో కూడా జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు విభాగంపై ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఏర్పాటు సంకల్ప దిశగా ఎంతో చురుకుగా పని చేస్తున్న హైడ్రాకు ఈ ట్రాన్స్ పోర్టు విభాగాన్ని అప్పగించాలని ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు సమాచారం.
ట్రాన్స్ పోర్టు విభాగాన్ని హైడ్రాకు అప్పగిస్తే పారదర్శకత చోటు చేసుకోవటంతో పాటు కోట్లాది రూపాయల అక్రమాలకు బ్రేక్ పడుతుందని కొందరు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని మొత్తం 130 వాహానాల నిర్వహణ, ఇంధనంతో పాటు మరమ్మతులను చేపట్టేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినా, ప్రస్తుతం ఈ విభాగం కేవలం ఖజానాకు కన్నం వేసేలా తయారైందన్న ఆరోపణలున్నాయి. మొత్తం వాహానాల్లో 110 వాహానాలు 15 ఏళ్లు దాటినవే ఉండటం గమనార్హం.
Also read: Food Safety: ఈ చికెన్ తిన్నారా.. మీరు డైరెక్ట్‌గా దవాఖానకే..!
జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు విభాగంలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్ లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఉన్నతాధికారులు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా, బ్రేక్ పడటం లేదు. ఈ విభాగం పరిధిలోని కొన్ని చెత్తను తరలించే వాహానాలు శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలించకపోయినా, తరలించినట్లు ట్రిప్పులను రాస్తూ, గతంలో భారీగా అక్రమాలు జరిగాయి. దీంతో గతంలో అధికారులు ఈ వాహానాల రాకపోకలపై నజర్ పెట్టేందుకు వీలుగా రెడియో ఫ్రీక్వెన్సీ డివైజ్ లను అమర్చారు. అయినా మరో రకంగా అక్రమాలకు ఈ వింగ్ లోని అధికారులు, సిబ్బంది తెర దీశారు. ఈ వింగ్ లో పని చేసే నాలుగో తరగతి ఉద్యోగులు కోట్లలో అక్రమార్జనకు పాల్పడటం, లగ్జరీ కార్లలో తిరుగుతున్నారంటే ఈ విభాగంలో ఏ తరహాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయో అంచనా వేసుకోవచ్చు.
నేటికీ కూడా జైల్ గార్డెన్ ట్రాన్స్ పోర్టు విభాగంలో మూలన పడి ఉన్న వాహానాల నెంబర్లు ఇండెంట్లలో రాస్తూ రోజుకి వందల లీటర్ల డీజిల్, పలు స్పేర్ పార్ట్స్ కుంభ కోణాలు కొనసాగుతున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం నాలాల్లోని పూడికతీత టెండర్లను దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై పూడికను బయటకు తీసినట్లు, దాన్ని డంపింగ్ యార్డుకు తరలించినట్లు మూలనపడ్డ వాహానాల నెంబర్లతో పాటు బైక్, ఆటో వంటి వాహానాల నెంబర్లను వేసి కూడా ఏకంగా రూ. వంద కోట్ల బిల్లులను క్లెయిమ్ చేసిన ఘటన బయటపడింది. ఈ ఘటనలో దాదాపు 12 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకున్నా, ఈ వింగ్ లో మార్పు రాలేదు. పారదర్శకంగా మరమ్మతులు జరిగేందుకు వీలుగా వాహానాల రిపేరు బాధ్యతలను ఆర్టీసికి అప్పగించినా, అక్రమాలు ఆగలేదు.
జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు వింగ్ లో డీజిల్, స్పేర్ పార్ట్స్, ఫేక్ ఇండెంట్లు వంటి అక్రమాలు, అవకతవకలు జరిగినపుడల్లా జీహెచ్ఎంసీ కమిషనర్ స్థాయి అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించి తమ పనైపోయిందని భావిస్తున్నట్లు కూడా విమర్శలున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది ట్రాన్స్ పోర్టు వింగ్ ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, వారిపై సీరియస్ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నేటికీ వాహానానికి డీజిల్, స్పేర్ పార్ట్స్ భిగించేందుకు రాసే ఇండెట్లపై అసిస్టెంట్ ఫోర్ మెన్ కు సంతకం పెట్టే అధికారం లేకపోయినా, ఒకే వాహానం నెంబర్ తో వరుసగా మూడు రోజుల పాటు రోజుకి పది లీటర్ల డీజిల్ కోసం ఇండెంట్లు రాసుకుంటున్నారంటే ఈ వింగ్ లో ఏ తరహాలో అక్రమాలు జరుగుతున్నాయో అంచనా వేయవచ్చు. గడిచిన పదేళ్లలో సుమారు వంద అక్రమాలు బయటపడినా, వీటిపై విజిలెన్స్ విభాగం విచారణ నిర్వహించి, నివేదికలను సమర్పించినా, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవటంపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఇటీవలే ఓ అసిస్టెంట్ ఫొర్ మెన్ పై కొందరు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు చర్యల్లేవు.
Also read: పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా!? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!?