GHMC: స్వేచ్చ బ్యూరో: ప్రజల కోసమే పని చేసే వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోనూ మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సందర్శన వేళల్లో ప్రజలను కలిసి వారి ఫిర్యాదులను, సమస్యలను స్వీకరిస్తుండగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. అన్ని సర్కారు ఆఫీసుల మాదిరిగానే జీహెచ్ఎంసీలో కూడా సామాన్యులు అధికారులను కలిసేందుకు సందర్శన వేళలను కేటాయించారు. ఆ వేళల్లో ఖచ్చితంగా సామాన్య సందర్శకులను కలవాల్సిన అధికారులు విజిటింగ్ వేళలు మెయింటెన్ చేస్తున్నామని చెబుతూనే, సందర్శకులకు అందుబాటులో ఉండటం లేదని సందర్శకులు వాపోతున్నారు.
ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు అధికారులు తమ విజిట్‌లు, పర్యటనలు, సమీక్షలు పూర్తి చేసుకుని మధ్యాహ్నాం మూడు నుంచి అయిదు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ సర్కారు ఆదేశాలున్నా, జీహెచ్ఎంసీలో మాత్రం అమలు కాకపోవటంతో పలువురు సందర్శకులు తీవ్ర స్థాయిలో అసహానం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ప్రతి రోజు టౌన్ ప్లానింగ్, ట్యాక్స్, శానిటేషన్, హెల్త్, వెటర్నరీ, బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు దోమలు, కుక్కల బెడద వంటి సమస్యలను పట్టుకుని ప్రతి రోజు వందల సంఖ్యలో విజిటర్స్ వస్తుంటారు. వీరితో పాటు పలు అభివృద్ది పనుల మంజూరీ కోసం ప్రజాప్రతినిధులతో పాటు భవన నిర్మాణ అనుమతుల కోసం బిల్డర్లు, రియల్టర్లు రాకపోకలు సాగిస్తుంటారు.
సామాన్య సందర్శకులు మాత్రం తమ సమస్య సర్కిల్, జోనల్ స్థాయిలో పరిష్కారం కాని పక్షంలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. కానీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు విజిటింగ్ వేళల్లో కూడా సమీక్షలు, విభాగానికి చెందిన సిబ్బందితో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. విభాగాల వారీగా ఉన్నతాధికారులకు కేటాయించిన చాంబర్ల వరకు వస్తున్న సామాన్య సందర్శకులు, చాంబర్ సిబ్బందికి తమ పూర్తి వివరాలతో స్లిప్ లు రాసి ఇచ్చి, సార్ ఎపుడు పిలుస్తారోనని వేచి ఉంటున్నారు. కానీ అధికారులు మాత్రం తాను మీటింగ్ లో బిజీగా ఉన్నానని సమాధానం చెప్పటంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న సందర్శకులు నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు.
Also Read: 2026 హోండా గోల్డ్ వింగ్ విడుదల.. రూ.44.30 లక్షల ధరతో లగ్జరీ టూరర్ ఎంట్రీ!
ఈ రకంగా సందర్శకులను కలవని ఉన్నతాధికారులు కనీసం సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనైనా అందుబాటులో ఉంటారేమోనని తమ ఆర్జీలు, ఫిర్యాదులు పట్టుకుని వస్తున్నారు. కానీ సంబంధించి విభాగాపతి గానీ, కమిషనర్ గానీ అందుబాటులో లేకపోవటంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరిగి వెళ్లిపోతున్నారు. సాధారణంగా మున్సిపల్ సంబంధించి సమస్యలు, ఫిర్యాదులను సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు పట్టించుకోవటం లేదని మొర పెట్టుకునేందుకే ప్రధాన కార్యాలయానికి వస్తున్న సందర్శకులకు ఉన్నతాధికారులు అందుబాటులో ఉండకపోవటం, ఎన్నో రోజుల ప్రదక్షిణలు చేసిన తర్వాత ఎట్టకేలకు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను, ఫిర్యాదును సమర్పించిన తర్వాత అనూహ్యామైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సందర్శకులు వాపోతున్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కొందరు ఉన్నతాధికారుల వ్యవహార శైలిలో కేవలం సామాన్య ప్రజలకే గాక, జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సైతం తిప్పలు తప్పటం లేదు. ఆనారోగ్యం కారణంగానో, ప్రమాదం బారిన పడో నెలల తరబడి సెలవుల్లో ఉంటున్న ఉద్యోగులు తమ జీతాల కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సొంత కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలనే పట్టించుకోని ఉన్నతాధికారులు ఇక సామాన్య ప్రజల ఫిర్యాదులను ఎలా పట్టించుకుంటారన్న వాదనలున్నాయి.
Also Read: మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్‌కు కోమటిరెడ్డి క్లాస్!
నెలల తరబడి సెలవుల్లో ఉండటంతో ఆగిన జీతభత్యాలు తిరిగి చెల్లించాలని ఆర్జీలు పెట్టుకుని, అది ప్రధాన కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు విభాగాధిపతి నుంచి మంజూరు పొందేందుకు ఉద్యోగులు నేరుగా ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. వారి అదృష్టం బాగుండి సదరు విభాగాధిపతి మంచి మూడ్ లో ఉండి, సదరు ఉద్యోగికి పెండింగ్ లో ఉన్న జీత భత్యాలు వెంటనే చెల్లించాలని సదరు సర్కిల్ డ్రాయింగ్ ఆఫీసర్ కు ఫోన్ చేసి చెబితే, దాని పరిమాణం ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మాపైనే ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ సర్కిల్ విభాగాం డ్రాయింగ్ ఆఫీసర్లు ఉద్యోగులపై మండి పడుతూ, వారికి చేయాల్సిన చెల్లింపులను మరింత ఆలస్యం చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోయారు.
ఇదే తరహాలో యూసుఫ్ గూడ సర్కిల్ కు చెందిన ఓ ఉద్యోగి రోడ్డు ప్రమాదం బారిన పడి, ఆరు నెలలు సెలవుల్లో ఉండగా, పెడింగ్ లో ఉన్న జీతం కోసం కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించుకోగా, వెంటనే చెల్లించాలని కమిషనర్ ఆదేశించినా, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మాత్రం తనపై కమిషనర్ కు ఫిర్యాదు చేస్తావా? అంటూ, నీకు పెండింగ్ జీతాలు చెల్లించేది లేదంటూ తేల్చి చెప్పిన సందర్భాలు సైతం ఉన్నాయి.
Also read: MGNREGA: ఉపాధి హామీ పనిలో అక్రమాలకు చెక్.. ఇకపై మొత్తం 3 దశల ఫోటోల రూల్..!