Godavari Express : గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళననకు గురయ్యారు. అయితే ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో వెళుతోంది. అందువల్ల పెనుముప్పు తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎస్-1, ఎస్-4, జీఎస్, ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రమాద సమయంలో మరో ట్రాక్‌పై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని వివిధ రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. బీబీనగర్ స్టేషన్‌లో విశాఖ-మహబూబ్‌నగర్ ప్రత్యేక రైలును ఆపేశారు. తిరుపతి-పూర్ణా (నాందేడ్) స్పెషల్, దిబ్రూగఢ్-సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లను భువనగిరిలో ఆపేశారు.
విశాఖలో ప్రతి రోజు సాయంత్రం 5.20 గంటలకు గోదావరి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 6.15 గంటలకు నాంపల్లి స్టేషన్ కు చేరుకుటుంది. ఈ రైలులో నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రద్దైన రైళ్లు..
కాచిగూడ-నడికుడి (07791)
నడికుడి-కాచిగూడ ( 07792)
సికింద్రాబాద్- వరంగల్ ( 07462)
వరంగల్ – హైదరాబాద్ ( 07463)
సికింద్రాబాద్- గుంటూరు (12706)
గుంటూరు-సికింద్రాబాద్ (12705)
సికింద్రాబాద్ – రేపల్లె ( 17645)