Peddpalli Train Accident: పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న ఘజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో ఆరు బోగీలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి.
దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ప్యాసింజర్ రైలు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు. ఎక్కడికక్కడ ట్రైన్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. నాగ్‌పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ సమాచారం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. 11 బోగీలు పట్టాలు దెబ్బతినడంతో మూడు రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
Also Read: ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలేనా? కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్? అభివృద్ధికి అడ్డే వారి పంథానా?
పెద్దపల్లి-రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందన్నారు. తక్షణమే రైల్వే ట్రాక్ ను పునరుద్దరించాలని కేంద్రమంత్రి కోరారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైల్వే ట్రాక్ పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
అయితే పునరుద్దరణకు 24 గంటలు పట్టే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పట్టాలన్ని విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. విద్యుత్ పోల్స్ కూడా విరిగిపోయినవట్లు తెలుస్తోంది. మూడు వందల మీటర్లు వరకు ట్రాక్ డ్యామేజీ అయ్యాయి. సింగిల్ ట్రాక్ ని పునరుద్దరణ చేసేందుకు రైల్వే అధికారుల కసరత్తులు చేస్తున్నారు. రైలు ఇంజన్ వైపు ఉన్న8 వ్యాగన్లతో సహా గూడ్స్‌ను రామగుండం వైపు తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా దానిని తిరిగి వెనుకకు మళ్లించి పెద్దపల్లి స్టేషన్‌లో ప్రయాణికులను దింపారు. వరంగల్ వైపు వెళ్లే రైళ్లను కూడా రామగుండం మంచిర్యాల స్టేషన్‌లో నిలివేశారు.