TG Public Survey: ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని రాబట్టేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఏకంగా ఐఏఎస్ ల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం తలపెట్టిన క్రీయాశీలకమైన 99 డేస్ ప్రోగ్రామ్ లోనే ఓ సర్వే చేయనున్నారు. నేరుగా ప్రజల వద్ద నుంచే సమాచారం సేకరించే ప్రయత్నం చేయనున్నారు. స్వయంగా ఐఏఎస్ లు గ్రౌండ్ లెవల్ నుంచి సర్వే రూపంలో సమాచారాన్ని తీసుకోనున్నారు. తద్వారా ప్రభుత్వ పనితీరుపై పబ్లిక్ రెస్పాన్స్ ను పసిగట్టనున్నారు.
వాస్తవానికి పబ్లిక్ ఓపీనియన్ లు తీసుకునేందుకు రెగ్యులర్ గా ఇంటిలిజెన్స్, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వాలు సమాచారం తెప్పించుకుంటాయి. కానీ ఈ దఫా నేరుగా ఐఏఎస్ లు గ్రౌండ్ లెవల్లో చేసిన అబ్జర్వేషన్ ను రిపోర్టు రూపంలో తయారు చేయనున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ను తెలుసుకోనుంది. ఈ పరిశీలన అక్యురేట్ గా ఉంటుందనేది సర్కార్ అభిప్రాయం. ఈ మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే జిల్లా కలెక్టర్లు ఈ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో సీరియస్ గా మానిటరింగ్ మొదలైందని సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు కావొస్తున్న సందర్భంగా స్పష్టమైన పనితీరును గుర్తించాలని సర్కార్ పెద్దలు భావిస్తున్నారు. పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరుతున్నాయా? క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉందా? ఆదరణ ఉందా? జనాలకు ఇంకా ఏం అవసరమున్నాయి? స్కీమ్స్, ప్రోగ్రామ్స్ పై ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు? అనే అంశాలను ఐఏఎస్ లు పరిశీలించనున్నారు. పైగా తాజాగా గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గం వచ్చినందున వారితో పాటే కలెక్టర్లు గ్రౌండ్ రిపోర్టును సేకరించనున్నారు. అధికారుల టీమ్ లు గ్రామాల్లో పర్యటించి, సామాన్యులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు.
పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి ఆరోపణలను సైతం ఈ సర్వేలో గుర్తించనున్నారు. రైతు భరోసా, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలు ఏ మేరకు సఫలీకృతమయ్యాయనేది తెలుసుకోనున్నారు. యూత్, విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్లు, స్కిల్ డెవలప్ మెంట్ లపై ఏమనుకుంటున్నారు? ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి వాటిపై ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టనున్నారు. అదే విధంగా మహిళలు భద్రత, ఆర్థిక చేయూత, పొదుపు సంఘాల బలోపేతం పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి, వంటివి గ్రౌండ్ లెవల్లో ప్రజలకు సంతృప్తిని ఇస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోనున్నారు. దీంతో పాటు రైతులు మద్దతు ధర, పెట్టుబడి సాయం, సాగునీరుకు సకాలంలో నిధులు అందడంపై రైతులు ఎలా ఫీలవుతున్నారనే దాన్ని కూడా ఆరా తీయనున్నారు.
ప్రభుత్వం కొత్త స్కీమ్ ల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులపై ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ఐఏఎస్ లు తెలుసుకోనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజల్లో ఆసక్తి, ఆధరణ వంటి వాటిని తెలుసుకోనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల అందుబాటుపై ప్రజలు తమ అభిప్రాయాలను కలెక్టర్లతో షేర్ చేసుకోనున్నారు. ఈ విషయాలన్నీ కలెక్టర్లు తమ రిపోర్టులో పొందుపర్చి సర్కార్ కు ఇవ్వనున్నట్లు తెలిసింది.
Also Read: Air Coolers: కూలర్‌లో ఐస్ గడ్డలు వేస్తున్నారా? జాగ్రత్త సుమా.. ఏదైనా జరగొచ్చు!
వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల విజిట్ లు జిల్లా కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. ప్రజల నుంచి వస్తున్న విభిన్నమైన ఓపీనియన్లతో కొందరు మంత్రులు జిల్లా పర్యటనలను సంపూర్ణంగా నిర్వహించలేకపోతున్నారు. పర్యటనల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని మంత్రులు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లలోనే పబ్లిక్ ఓపీనియన్ల సేకరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం గమనార్హం.