Minister Ponnam Prabhakar : సంక్రాతి వచ్చిందంటే.. బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ హడావిడి ఏ తీరుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవకాశం వచ్చింది కదా అని అందిన కాడికి దండుకునేందు సిద్ధమైపోతుంటారు. ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచేసి.. ప్రయాణికుల్ని గుల్ల చేస్తుంటారు. కానీ.. ఇకపై అలా వీలు కాదంటున్నారు… తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అధిక ధరలకు బస్సు టికెట్లు విక్రయించినట్లు తెలిస్తే.. ఆయా బస్సుల్ని సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలతో పాటుగా రాష్ట్రంలోని జిల్లాలకు భారీగా తరలివెళుతుంటారు. వారి సౌకర్యార్థం.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం ఏకంగా.. 6,432 ప్రత్యేక బస్సులను టీజీఆర్టీసీ నడపేందుకు నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 10 శుక్రవారం నుంచి మొదలవుతాయని వెల్లడించారు.
ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి పొన్నం… ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ మేజర్ బస్ స్టేషన్ దగ్గర ప్రత్యేక అధికారులు ఉండాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం పర్యవేక్షిస్తూ,చర్యలు చేపట్టాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా.. బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుండాలని అధికారులకు సూచించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ కు హెచ్చరిక..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక చేశారు. పండగల సమయంలో ప్రయాణికుల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అదనపు చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామన్నారు. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చిన రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పండగ పూట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్న మంత్రి పొన్నం.. ఎలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు చేస్తే.. చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని బస్సులు, ఛార్జీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం. ఏకంగా రవాణా శాఖ మంత్రే ఆదేశాలు జారీ చేయడంతో పాటు తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధానత్య కల్పిస్తుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్య స్థానాలకు వెళ్లాలని కోరారు. తమ ప్రజా ప్రభుత్వం.. అన్ని వర్గాల భద్రత గురించి ఆలోచిస్తుందని, ఎవరికి సమస్య వచ్చినా వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు.
సాధారణంగానే.. పండుగ రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు సృతి మించుతుంటాయి. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటారు. ఎవరైనా.. ఓ నలుగురు కుటుంబ సభ్యులతో ప్రయాణం పెట్టకుంటే.. జేబుకు చిల్లు పడాల్సింది. కానీ.. ప్రస్తుతం ప్రభుత్వం అదనపు ఆర్టీసీ బస్సుల్ని నడపడం, ప్రైవేట్ ట్రావేల్స్ ధరలపై నియంత్రణ విధించడంతో.. సామాన్యులకు పెద్ద ఊరటే అంటున్నారు.