
Bandi Sanjay: బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. అధ్యక్ష పదవి పోగొట్టుకున్నారు. రెండు రోజులుగా డిసప్పాయింటెడ్ మూడ్‌లో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. అధ్యక్ష పదవి పోయిందిగా.. బండిని ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారు కొందరు. కానీ…..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లిపోయింది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వాగతం పలికేందుకు.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కార్యకర్తలు. బండి సంజయ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. తమ అభిమాన నాయకుడిని భుజాలపై మోశారు. కండువాలు కప్పారు. పూల మాలలు వేశారు. పూల కిరీటమూ తొడిగారు. అధ్యక్ష కిరీటం లేకపోయినా.. ఆయనే మా అసలైన నాయకుడనేలా.. బీజేపీ కార్యకర్తల కోలాహలం కనిపించింది.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర పరిణామం కూడా జరిగింది. బండికి స్వాగతం పలికే సమయంలో.. కార్యకర్తలంతా సీఎం..సీఎం.. అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అంటే, తెలంగాణ బీజేపీ సీఎం కేండిడేట్ బండి సంజయే అని వారంతా భావిస్తున్నారు. అభిమానులు సీఎం.. సీఎం.. అంటుంటే.. అలా అనొద్దని బండి సంజయ్ వారించారు. అయినా, కేడర్ తగ్గేదేలే అంటూ మరింత బిగ్గరగా సీఎం స్లోగన్స్ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
బండి సంజయ్‌కంటే ఒకరోజు ముందుగానే కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ దగ్గరుండి స్వాగత ఏర్పాట్లు చూశారు. కిషన్‌రెడ్డిని, ఈటలను భుజాలపై మోసి.. అభిమానం చాటుకున్నారు. అయితే.. వారికి పోటీగానా? అన్నట్టు బండి సంజయ్‌కు సైతం అంతకంటే గ్రాండ్ వెల్‌కమ్ పలకడం.. సీఎం..సీఎం అంటూ నినాదాలు సైతం చేయడం.. 500 కార్లతో ర్యాలీగా తీసుకెళ్లడం.. మామూలు విషయం కాదు. బీజేపీలో అధిపత్య పోరు మామూలుగా లేదుగా..అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.