ACB Raids: ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు. సోదాలు నిర్వహించిన ఏసీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ అధికారి అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ, సదరు అధికారిని అదుపులోకి తీసుకుంది. అవినీతికి పాల్పడి ఎంత మూట కట్టుకున్నా చివరికి పాపం పండింది. ఇప్పుడు ఆ అధికారి ఊసలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి. హన్మకొండ డీటీసీగా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలతో అసలు కథ బయటపడింది.
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. జస్ట్ అలా కబురు అందితే చాలు.. ఏసీబీ పక్కా ప్లాన్ గా దాడులు చేస్తోంది. అలా చిక్కిన అవినీతి అధికారే.. హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్. అక్రమంగా ఆస్తులను కూడ బెట్టుకున్నారన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు తాజాగా శ్రీనివాస్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా రూ. 4.04 కోట్ల రూపాయల విలువ గల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది.
5 వేర్వేరు ప్రాంతాలలో 15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాస్ ఇంటితో పాటు, అతని బంధువుల గృహాలలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్, జగిత్యాల లోని మొత్తం ఐదు ప్రాంతాలలో ఏసీబీ సోదాలు నిర్వహించగా, పెద్ద ఎత్తున అక్రమాస్తులను కనుగొన్నారు. రూ. 2.79 కోట్ల విలువైన మూడు గృహాలు, రూ. 13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్లు, రూ. 14 లక్షల విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అంతేకాకుండా సుమారు కిలోన్నర బంగారం, 400 గ్రాముల వెండి, రూ. ఐదు లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ. 22.85 లక్షల విలువ గల కార్లు బైక్ లను ఏసీబీ అధికారులు సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Vidadala Rajini: పట్టువదలని టీడీపీ నాయకుడు.. ఎట్టకేలకు విడదల రజినీపై కేసు నమోదు
దీనితో శ్రీనివాస్ ను ఏసీబీ అరెస్ట్ చేయగా, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు ఏసీబీ అధికారులు దృవీకరించారు. అనంతరం కస్టడీ కోరి విచారణకు అవకాశం ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. గతేడాది ఫిబ్రవరిలో శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ డీటీసీ గా బాధ్యతలు నిర్వహించగా, అంతకుముందు హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సైతం పని చేశారు.