Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల పేరుతో 18వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని, ఆర్ అండ్ బీ 12 వేల కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ 6వేలకోట్లు అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. అసెంబ్లీలోని ఎల్ఓపీ ఛాంబర్ లో మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారని, 1800 కోట్లు నేరుగా వస్తాయని, నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపుతారని మండిపడ్డారు. చాలా పనుల బిల్లులు ఇవ్వడం లేదు, రోడ్లకు గుంతలు పడినా మరమ్మత్తులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం హ్యాం రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారన్నారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని, కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని,తేడా 50 శాతం వస్తోందని పేర్కొన్నారు.
సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసిందన్నారు. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే… ఇప్పుడు 10 శాతం పెట్టారని ఆరోపించారు. మొత్తం 34 లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని ధ్వజమెత్తారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారన్నారు. పంచాయతీరాజ్ లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో 5 శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేది, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చు అన్నారు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని తెలిపారు. నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయనిఅన్నారు. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి,ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారన్నారు. రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని, టెండర్లలో కుమ్మక్కు అయ్యారన్నారు. సివేట్,సరళ,బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్కులు సివేట్ కు 3 వర్కులు జె ఇన్ఫ్రా కంపెనీకి,చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారని ఆరోపించారు.
Also Read: GHMC: దోమలపై దండోరా.. క్లీన్ సిటీగా హైదరాబాద్.. జీహెచ్ఎంసీ కమిషనర్ దూకుడు!
రాష్ట్రంలో టెండర్ యక్సెస్ కు 5 శాతం సీలింగ్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యక్సెస్ ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లలో అవినీతి జరిగిందని, వెంటనే టెండర్లను రద్దుచేసి దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ కు, రిజర్వ్ బ్యాంకుసహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేసి పారదర్శంగా నిర్వహించాలన్నారు. సీఓటీ అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేయాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పద్దులు చర్చకు వచ్చినపుడు బీఆర్ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామన్నారు. హైకోర్టు విచారణకు పట్టుబడతామని వెల్లడించారు. సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని మేము బయటపెట్టిన తర్వాత లెస్ కు పోయిందని వెల్లడించారు.
సిద్దిపేటపై ఎందుకింత కక్ష .. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఈర్షాద్వేషాలేనా అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో రద్దు చేసిన 1,070 కోట్ల నిధులను పునరుద్దరించి నిలిచిపోయిన అభివృద్ధి కొనసాగించాలని ఈ నెల 22న సిద్దిపేట కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మంగవారం బహిరంగ లేఖరాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే మీకు రోజు గడిచేది కాదని సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్షాద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని లేఖలో పేర్కొన్నారు.. ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మరచిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే గాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73కోట్లు కేటాయింపు జరిగిందని, ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను మీరు రద్దు చేశారన్నారు. దీంతో పనులన్నీ ఆగిపోయాయని, చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేదని, సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్దరించాలని, అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోండి అని లేఖలో పేర్కొన్నారు.
Also Read: Sour Curd: వేసవిలో పెరుగు త్వరగా పులుస్తుందా? తాజాగా ఉండేందుకు ఇలా చిన్న పని చేయండి చాలు