Harish rao Fire on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ‘నా గురించి మాట్లాడటం ఆపి ప్రజల గురించి ఆలోచించండి. రేవంత్ ను సన్నాసి అని నేను అనలేనా? ఇంతకాలం ఓపిక పట్టాం.. మర్యాదకు కూడా ఓ హద్దు ఉంటుంది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. మాట తప్పిందెవరు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూములు వాపస్ ఇస్తామన్నారు.. వచ్చినంక ఎందుకు ఇయ్యలేదు? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు? రుణమాఫీ పూర్తిగా జరిగే వరకు మిమ్మల్ని వదిలేదు. ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ అయ్యింది. నాణ్యమైన కరెంట్ కేసీఆర్ హయాంలోనే వచ్చింది. రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా..? దీనిపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమా? ఎన్నికల్లో రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినంక ఆ మాటనే మరిచిపోయింది మీరు కాదా? అప్పుడు దొడ్డు ఒడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తానంటున్నావ్. అసలు ఇంతకు రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉంటేనే అదే ఒక పెద్ద గొప్ప.
Also Read: మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు.. నిమజ్జనం రోజు ఇలా ప్రయాణించండి!
రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తే ఉపయోగముంటది. అనవసరంగా నాపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. గాంధీ భవన్ లో పీసీసీ కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాపై ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ భాష తీరు మార్చుకోవాలి. ఇన్నాళ్లు ఓపిక పట్టాం. ఇకముందు ఓపిక పట్టబోం. మర్యాదగా మెదులుకుంటే మంచిది.
నా ఎత్తుపై పదే పదే మాట్లాడడం సరికాదు. నేను తాటిచెట్టంతా పెరిగినా.. తెలంగాణ ఉద్యమం నన్ను మరింత ఎత్తుకు పెంచింది. ప్రతిసారి నువ్వు నా ఎత్తు గురించి మాట్లాడి నీ విలువను తగ్గించుకుంటున్నావ్. నా ఎత్తు అనేది దేవుడిచ్చిన సృష్టి. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సింది నా ఎత్తు కోసం కాదు.. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం మాట్లాడాలి. కానీ, అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నారు. నోరు తెరిస్తే చాలు అన్నీ బూతులే వస్తున్నాయి. ఆ తీరును రేవంత్ రెడ్డి మార్చుకోవాలి. గత బీఆర్ఎస్ పాలనలో టీచర్లను బదిలీ చేయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. ఈ విషయంలో ఒకసారి సరిచూసుకో రేవంత్ రెడ్డి. మీకే అర్థమవుతుంది మీరు చెప్పేది సుద్ద అబద్దమని.
కౌశిక్ రెడ్డి, గాంధీ ఇష్యూలో కాంగ్రెస్ నేతలకే క్లారిటీ లేదు. కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు’ అంటూ హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read: సీఎం పదవికి రాజీనామా – అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన