రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఓ రేంజ్ లో ఫైరయ్యారు. కార్పొరేషన్లను కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన అనుచరులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న ఆసక్తి, ప్రజల సంక్షేమం కోసం నిధులు విడుదల చేయడంలో లేదని మండిపడ్డారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్లతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 17 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం పట్ల హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న 33 కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మొదటి విడతలో నియమితులైన చైర్మన్లు నిధుల లేమితో ప్రజలకు ఒక్క పైసా సాయం చేయలేకపోయారని గుర్తు చేశారు. 21 కార్పొరేషన్లకు రూపాయి కూడా ఇవ్వకుండా వాటి ఉద్దేశ్యాన్నే నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని హరీశ్ రావు విమర్శించారు. మాల, మాదిగ, సంతు సేవాలాల్, కొమురం భీం, ఏకలవ్య, మైనార్టీ కార్పొరేషన్లకు నయా పైసా కేటాయించలేదని పేర్కొన్నారు. ఇది ఆయా సామాజిక వర్గాలను అవమానించడమేనని అన్నారు. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, వాల్మీకి వంటి కుల వృత్తుల కార్పొరేషన్లకు నిధులు కేటాయించినా, ఖర్చు చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని దుయ్యబట్టారు.
నిధులు లేని పదవులు కేవలం అలంకారప్రాయమేనని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల ద్వారా కులాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని, కేటాయించిన నిధులను క్షేత్రస్థాయిలో ఖర్చు చేసి పేదలను ఆదుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
గణాంకాలతో సహా ప్రభుత్వం వైఫల్యాలను హరీశ్ రావు ఎండగట్టారు. మొత్తం 33 కార్పొరేషన్లకు రూ. 14,521 కోట్లు కేటాయించి, కేవలం రూ. 3198 కోట్లు మాత్రమే విడుదల చేశారని వెల్లడించారు. ఇందులో ఖర్చు చేసింది కేవలం రూ. 305 కోట్లు మాత్రమేనని వివరించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో కుల వృత్తులకు ఆసరా కరువైందని, కేసీఆర్ హయాంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయని విమర్శించారు.
ALSO READ: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే!