
Hyderabad Rain: ఇది ఎండాకాలమా? పోయే కాలమా? ఓవైపు సుర్రుమనిపిస్తున్న ఎండలు.. మరోవైపు దంచికొడుతున్న వానలు. ఈ ఎండాకాలం ఆగమాగం అవుతోంది. సమ్మర్ అనే మాటేకానీ.. వానాకాలం మాదిరి భారీ వర్షాలు. గత వారమే వాన పడింది. ఇప్పుడు అంతకుమించి కుమ్మేసింది.
సాయంత్రం అవగానే వర్షం స్టార్ట్. ముందుగా మేఘాలు కమ్ముకున్నాయ్. వెలుతురు పోయి చీకటి. అంతలోనే ఈదురుగాలులు. మెరుపులు, ఉరుములు. చూస్తుండగానే కుండపోత. గంటల తరబడి అతిభారీ వర్షం. నగరం నిండా మునిగింది.
పటాన్ చెరువు నుంచి చార్మినార్ వరకు.. మాదాపూర్ నుంచి ఉప్పల్ వరకు.. అక్కడాఇక్కడా అనే తేడా లేకుండా హైదరాబాద్‌ను పూర్తిగా ముంచేసింది భారీ వర్షం.
వాన కంటే ఈదురుగాలుల ఎఫెక్టే ఎక్కువ. చెట్లు కూలాయి. కరెంట్ పోల్స్ విరిగాయి. ఫలితం.. భాగ్యనగరం అంధకారమయం. అనేక ప్రాంతాల్లో పవర్ కట్.
వర్షం నీటితో జంక్షన్లన్నీ జామ్. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. నరకం అంటే ఏంటో మరోసారి చవిచూశారు హైదరాబాదీలు.
హైదరాబాద్ అనే కాదు.. తెలంగాణలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వాన కురుస్తుండటంతో తీవ్రస్థాయిలో నష్టం జరుగుతోంది.