Jurala Project: స్వేచ్ఛ బ్యూరో: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ వర్షాల ప్రభావంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతూ నిండుకుండలా మారుతున్నాయి. అయితే, ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నీటి విడుదలపైనే ఆధారపడిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం వెలవెలబోతోంది. మహారాష్ట్రలో వర్షాలు నిలకడగా కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నీటి నిల్వలు త్వరలోనే పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టులు నిండిన వెంటనే దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తారని, త్వరలోనే జూరాల, శ్రీశైలంకు కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమవుతాయని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది.
ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతోంది. మంగళవారం ఉదయానికి ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 68,034 క్యూసెక్కులు చేరుతుండగా, గత సీజన్ తో పోలిస్తే ఏకంగా 18200 క్యూసెక్కుల ఇన్ఫ్లో పెరగగా ప్రాజెక్టు నుంచి 14,780 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గానూ ప్రస్తుతం 1699.38 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 103.24 టిఎంసిల నీరు నిల్వ ఉంది.
Also read: Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!
ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి 46,848 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తికి 12,500, కాలువలకు 3, 751 క్యూసెక్కుల వరద నీటి విడుదల చేయడంతో మొత్తం 16,351 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణ పూర్ డ్యాంకు ఎగువ ప్రాంతాల నుంచి 14,428 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 8,209 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం గరిష్ఠస్థాయి నీటి మట్టం 1615 అడుగులకు గానూ ప్రస్తుతం 1604. 63 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 24.67 టీఎంసీలు ఉన్నది.
ఎగువన ఉన్న కర్ణాటక జలాశయాలు నిండుతున్నప్పటికీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మాత్రం ఇంకా వెలవెలబోతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదలయ్యే నీటిపైనే ఆధారపడి ఉండటంతో, నారాయణపూర్ డాం లో 37 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యాంకు 25 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో 6500 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు.
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లకు గాను ప్రస్తుతం 315.997మీటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాలలో 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.165 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువన భారీ వర్షాల కారణంగా నారాయణపూర్ డాం నీటి నిల్వలు పెరిగిన అనంతరం జూరాలకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.