Rain Update: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో విస్తరంగా వానలు పడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టులకు నిండుకుండల్లా మారాయి. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు తెలంగాణలో ని పలు ప్రాంతాల్లో.. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు.
మరో నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా.. నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాదాపు 20 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా..
12-20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం
ఈ జిల్లాల్లో 12 నుంచి 20 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైడ్రా. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40-30 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న భద్రాద్రి కొత్తగూడెంలో12.75 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలోని మద్దుకూరులో 12.75 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లోని జడ్చర్లలో 12.6, వికారాబాద్‌లోని పరిగిలో 12.48, సూర్యాపేటలోని మల్లెచెరువులో 12.18, నాగర్ కర్నూల్‌లోని వెల్తూర్ లో 11.85, వనపర్తిలోని ఘనపూర్ లో 11.73 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
Also Read: ఆగమ శాస్త్రానికి విరుద్ధం.? కొండపై AI తో లాభమా.? నష్టమా.?
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 5.23 సెంటీమీటర్ల వర్షపాతం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 5.23 సెంటీమీటర్ల అత్యధిక వర్ష పాతం నమోదైంది. బహదూర్ పురా లోని రెండు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, లంగర్ హౌజ్‌లో 4.25, శివరాంపల్లిలో 4.68, చార్మినార్‌లో 4.23, ఆసిఫ్ నగర్‌లో 3.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.