Rain Alert: నైరుతి రుతుపవనాలు ఓ వైపు.. మరోవైపు వాయుగుండం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. బుధవారం కూడా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడతాయని తేల్చి చెప్పింది. గతరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో వానల విజృంభణ-ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య ఏర్పడిన తీవ్ర వాయుగుండం రూటు మార్చింది. బుధవారం నాటికి జార్ఖండ్-ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు రుతుపవనాలు ప్రభావం ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు తెలిపింది.
వాతావరణ శాఖ అలర్ట్-ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం. శుక్రవారాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు-బుధవారం అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు అలర్ట్- మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ లో 5.8 సెంటీ మీటర్లు వర్షం కురిసింది. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4 సెంటీమీటర్లు పైగానే వర్షం నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట-4 సెంటీ మీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేట-3.8, కామారెడ్డి జిల్లా మొగ్దంపూర్- 3.4 సెంటీమీటర్లు వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
ALSO READ: మియాపూర్‌లో మ్యాన్‌హోల్ విషాదం.. మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు! గాలింపు ముమ్మరం
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. జిల్లాల అధికారులు అవసరమైన చోట్ల వివిధ శాఖల సమన్వయంతో చేసుకుంటూ పని చేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఐదు లేదా ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు.