Heavy Rains: తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం 31 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఒకవైపు టెంపరేచర్ పెరిగి ఉక్కపోత పెరిగుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.
రాబోయే 2, 3రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం..
రాబోయే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురిస్తాయని తెలిపారు. టెంపరేచర్ పెరుగుతుండటంతో.. సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా 11,12,13 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది.
నిన్న ఖమ్మంలో 35డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
నిన్న అత్యధికంగా ఖమ్మంలో 35డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 34, మెదక్, నిజామాబాద్, రామగుండంలో 32డిగ్రీలు నమోదైంది.
ఆదిలాబాద్‌లో 8.1సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు
ఇక అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 8.1సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్‌లో 6.3,ములుగు, కరీంనగర్‌లో 5, ఆసిఫాబాద్ 4.9, మంచిర్యాల 4.4,భద్రాద్రిలో 3.7, సూర్యాపేట 3.4 ,భూపాలపల్లిలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
ఇవాళ ఆదిలాబాద్, భద్రాద్రి, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ , ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట ,వికారాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో భారీ వర్షం..
ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విశాఖలో, శ్రీకాకుళం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో స్కూల్ వెళ్లే చిన్నారులు, బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అటు సీతమ్మధార, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, ఆరిలోవ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఉదయం 7 గంటల వరకు ఎండ కన్పించినా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన దంచికొడుతోంది. అక్కడక్కడ చెట్లు విరిగి కిందపడ్డాయి. అలాగే కరెంట్ వైర్లు కూడా తెగిన పరిస్థితి నెలకొంది.
Also Read: తురకపాలెంలో ICAR బృందం పర్యటన..
మరో మూడు రోజులు భారీ వర్షాలు..
అంతేకాకుండా రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏపీలో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లకూడదు.. అలాగే సముద్రంలోకి వేటకి వెళ్లే మత్య్సకారులు మరో మూడు రోజులు వరకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.