Telangana High Court: ఇటీవల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపులో వరుడు ఊరేగుతూ, ఇలా వేర్వేరు ఘటనల్లో పలువురు కుప్పకూలి మృతి చెందిన ఘటనలు వరుసగా జరిగాయి. సేమ్ టు సేమ్ అలాంటి ఘటన తెలంగాణలో మంగళవారం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఓ లాయర్.. సీరియస్ గా వాదనలు వినిపిస్తూ, తుదిశ్వాస విడిచారు. ఏకంగా న్యాయస్థానంలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
న్యాయవాది పసునూరి వేణుగోపాల్.. రోజు వారీ మాదిరిగానే మంగళవారం హైకోర్టుకు వచ్చారు. తన క్లయింట్ తరపున సీరియస్ గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయవాదులు, ఆయనను వైద్యశాలకు తరలించారు. అంతలోనే వేణుగోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వాదనలు వినిపిస్తూ న్యాయవాది వేణుగోపాల్ కుప్పకూలి, కన్నుమూయగా, తోటి న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టు లో అన్ని బెంచ్ లలో విచారణలను న్యాయమూర్తులు నిలిపి వేశారు. అన్ని కోర్టులలో విచారణలను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. కాగా వేణుగోపాల్ ఎన్నో కీలకమైన కేసులను వాదించి న్యాయవృత్తిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు.
హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన న్యాయవాది
గుండెపోటుతో లాయర్ పసునూరి వేణుగోపాల్ మృతి pic.twitter.com/aozrX7yW2a
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025