BigTV English

KTR: జ‌డ్జ్‌మెంట్ డే! కేటీఆర్ లోప‌లా? బ‌య‌టా?

KTR: జ‌డ్జ్‌మెంట్ డే! కేటీఆర్ లోప‌లా? బ‌య‌టా?

క్వాష్ పిటిష‌న్‌పై నేడు హైకోర్టు తీర్పు
వెలువ‌రించ‌నున్న జస్టిస్ లక్ష్మణ్
గ‌తంలో ‘నాట్ టు అరెస్ట్’ ఉత్తర్వులు
ఇప్పుడు ఎత్తివేస్తారా? పొడిగిస్తారా?
క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తే అరెస్టు?
బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌
పిటిష‌న్‌ను కొట్టేస్తే రెడీగా ఏసీబీ
ఈడీ విచార‌ణ‌కు వెళ్ల‌క‌ త‌ప్ప‌దు!


తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఫార్ములా ఈ-రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తుది ఉత్తర్వులను వెలువరించనున్నది. కేటీఆర్ పిటిషన్‌ను గత నెల 20న విచారించిన హైకోర్టు… ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడానికి నిరాకరించింది. ఏసీబీ తన దర్యాప్తును యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, కేటీఆర్ అందుకు సహకరించాలని స్పష్టం చేసింది.

తదుపరి విచారణ జరిగే (డిసెంబరు 30) వరకు కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. దాన్ని డిసెంబరు 31 వరకు, ఆ తర్వాత తుది తీర్పు వెలువరించేంత వరకు పొడిగించింది. తుది తీర్పును మంగళవారం వెలువరించనున్న నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తుందా?.. కేటీఆర్ కోరినట్లుగా ఎఫ్ఐఆర్‌ను రద్దు చేస్తుందా?.. మధ్యంతర ఉత్తర్వులను మరికొన్ని రోజులు పొడిగిస్తుందా?.. ఆ ఉత్తర్వులను పూర్తిగా ఎత్తివేస్తుందా?.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది.


తీర్పును అనుస‌రించే ఏసీబీ, ఈడీ చ‌ర్య‌లు
హైకోర్టు వెలువరించే ఉత్తర్వులు కేటీఆర్‌పై ఏసీబీ, ఈడీ తదుపరి తీసుకునే చర్యలకు కీలకంగా మారనున్నాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలూ ఇప్పటికే నోటీసులు జారీచేసి విచారణకు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను ఆదేశించాయి. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వులో ఉన్నదనే కారణాన్ని చూపి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేసుకోగా.. సానుకూల స్పందనే వచ్చింది.

తుది తీర్పు వెల్లడైన తర్వాత ఏసీబీ, ఈడీ ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం ఏసీబీ అరెస్టు చేయకుండా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేటీఆర్‌కు ఒకింత ఊరటనిచ్చాయి. తుది తీర్పులో హైకోర్టు ఎలాంటి స్పష్టత ఇస్తుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. కేటీఆర్ అరెస్టుపై హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానున్నది. ఏసీబీ, ఈడీ అరెస్టు చేయక తప్పదనే ఊహాగానాల సమయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సోదాలు కూడా మొద‌లు?
ఇంతకాలం కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగాయి. ఇప్పుడు తుది తీర్పులో ఈ ఉపశమనాన్ని తొలగిస్తే వెంటనే ఏసీబీ అరెస్టు చేయడానికి సిద్ధమవుతుందా?.. ఇప్పటికే నాంపల్లి కోర్టు నుంచి సోదాలు చేసేందుకు అనుమతి రావడంతో ఇకపైన అవి కూడా మొదలవుతాయా? ఈడీ విచారణకు గడువు కోరినందున ఈ నెల 9న ఏసీబీ ఎంక్వయిరీకి హాజరయ్యే ముందే ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయా?.. ఇలాంటి అనేక చర్చలు ఊపందుకున్నాయి.

అరెస్టు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదంటూ కేటీఆర్ పలు సందర్భాల్లో కామెంట్ చేయడం వెనక ముందుగానే లీకులు అందాయా అనే అనుమానాలకూ తావిస్తున్నది. హైకోర్టు వెలువరించే తీర్పు కేటీఆర్‌కు మాత్రమే కాక ఇటు ఏసీబీకి, అటు ఈడీ అధికారులకు ఉత్కంఠగా మారింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే అవి ఎలాంటి వ్యూహం రచిస్తాయన్నది కీలకం.

ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామాలు :
= కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా, ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏ-2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3గా పేర్కొంటూ డిసెంబరు 18న ఎఫ్ఐఆర్ నమోదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1-ఏ), 13 (2), ఐపీసీలోని సెక్షన్ 409, 120(బి) నమోదు.
= వెంటనే (డిసెంబరు 19న) హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌గా క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసిన కేటీఆర్
= జస్టిస్ శ్రావణ్ కుమార్ బెంచ్ ముందు విచారణ జరిగి మరుసటి రోజుకు (డిసెంబరు 20) వాయిదా పడింది.
= డిసెంబరు 20న విచారణ జరిపిన హైకోర్టు… క్వాష్ పిటిషన్‌ ను కొట్టి వేయడానికి నిరాకరించింది.
డిసెంబరు 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. యధాతథంగా దర్యాప్తును కొనసాగించుకోవచ్చని, విచారణకు కేటీఆర్ సహకరించాలని స్పష్టం చేసింది.
= డిసెంబరు 27న జరిగిన విచారణ సందర్భంగా ఏసీబీ తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు.
= ‘నాట్ టు అరెస్ట్’ ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు.
= డిసెంబరు 30న జరిగిన విచారణకు కేటీఆర్ తరఫున కౌంటర్ రిప్లై దాఖలు. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా డిసెంబరు 31 వరకు ఉత్తర్వుల పొడిగింపు.
= డిసెంబరు 31న కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు కంప్లీట్. తుది ఉత్తర్వులను రిజర్వు చేసిన హైకోర్టు. అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు కంటిన్యూ.
= జనవరి 7న తుది ఉత్తర్వులు ఇవ్వనున్న హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×