Meenakshi Chaudhary: సినీ సెలబ్రిటీలకు సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంత టాలెంట్ ఉన్నా లక్ కలిసిరాకపోతే ఫెయిల్యూర్స్ ఎదురవ్వడం సహజం. కానీ సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను ఒకేలా చూసే నటీనటులు చాలా తక్కువమంది ఉంటారు. సక్సెస్ రాగానే గాలిలో తేలిపోయి, ఫెయిల్యూర్ రాగానే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అలా తాను కూడా ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది మీనాక్షి చౌదరి. త్వరలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ప్రేక్షకులను అలరించబోతున్న మీనాక్షి.. తను డిప్రెషన్‌లోకి వెళ్లడానికి కారణమయిన సినిమా గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.
కలలు నెరవేరలేదు
మీనాక్షి చౌదరీ (Meenakshi Chaudhary) ఇప్పటికీ హీరోయిన్‌గా నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా తనకు టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ లభించింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలోనే తనకు తమిళంలో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఆఫర్లు బాగానే వచ్చినా కూడా మీనాక్షికి సక్సెస్ రావడానికి చాలా సమయమే పట్టింది. అదే సమయంలో విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి. ఈ మూవీ వల్ల తనకు కోలీవుడ్‌లో స్టార్ స్టేటస్ దక్కుతుందని కలల్లో తేలిపోయింది. కానీ రియాలిటీలో ఈ సినిమా వల్ల తనకు సక్సెస్ కాకుండా ట్రోల్స్ ఎదురయ్యాయి. తాజాగా దీనిపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ.
Also Read: ‘సంక్రాంతికి వస్తున్నాం’పై మహేశ్ బాబు మొదటి రివ్యూ.. ఇది మాత్రం మిస్ అవ్వరుగా.!
సెకండ్ హీరోయిన్‌గానే
విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ (The GOAT) సినిమా ఎన్నో రకాలుగా ట్రోల్స్‌ను ఎదుర్కుంది. అందులో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరీపై కూడా ట్రోల్స్ వచ్చాయి. అసలు తను సినిమాలో ఎందుకు ఉందో అర్థం కాలేదని, తన పాత్రను పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’లో కూడా అదే జరిగింది. సెకండ్ హీరోయిన్ అంటూ మీనాక్షిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు త్రివిక్రమ్. కానీ ఆ పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేకుండా చేశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాధాన్యత లేని పాత్రలు చేసి ట్రోలింగ్ ఎదుర్కోవడం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని మీనాక్షి చెప్పుకొచ్చింది.
వాటిపైనే ఫోకస్
‘‘విజయ్ గోట్‌లో నటించిన తర్వాత నన్ను చాలామంది ట్రోల్ చేశారు. దానివల్ల ఒక వారం పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. కానీ లక్కీ భాస్కర్ వల్ల నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. అందుకే ఇప్పటినుండి మంచి సినిమాలపైనే నేను ఫోకస్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను’’ అని తెలిపింది మీనాక్షి చౌదరీ. ప్రస్తుతం తను వెంకటేశ్‌కు జోడీగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో కూడా మీనాక్షి సెకండ్ హీరోయిన్‌గానే నటించినా తన క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే విడుదలయిన పోస్టర్స్, ట్రైలర్‌లో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.