Modi telangana tour:
టీఆర్ఎస్ ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ ఉత్కంఠ రేపుతోంది. మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. రామగుండం పర్యటనకు సీఎం కేసీఆర్‌ను నామమాత్రంగానే ఆహ్వానించారని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఆహ్వానంలో ప్రొటోకాల్ పాటించకుండా ప్రజలను అవమానించారని పేర్కొంటూ గులాబీ పార్టీ ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? అంటూ టీఆర్‌ఎస్ మరో ట్వీట్ చేసింది. తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల అమలు సంగతేమిటి? నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
సీపీఐ హెచ్చరిక
ప్రధాని మోదీకి పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ హెచ్చరించింది. తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు మోదీకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మోదీ ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ చేసిన మంచి పని ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీ విద్యాలయం ఏర్పాటు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నవంబర్ 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. టీఆర్ఎస్ తో కలిసి మోదీ పర్యటనను అడ్డుకుంటాయని ప్రకటించారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ కలిసి వస్తే స్వాగతిస్తామని కూనంనేని పిలుపునిచ్చారు. మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు తెలుపుతామని ప్రకటించారు.
విద్యార్థుల ఆందోళన
తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లుపై కేంద్రం వైఖరి చెప్పాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్య కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే యూనివర్శిటీల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును బేషరతుగా ఆమోదించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరింది. రావాల్సిన ఉద్యోగాలను అడ్డుకుంటూ తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును అడ్డుకుంటున్న గవర్నర్ పై మండిపడ్డారు విద్యార్థి నాయకులు. తెలంగాణ విద్యార్థుల జీవితాలను అంధకారంగా మార్చాలని చూస్తున్న గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలని కోరారు. తమకు న్యాయం చేయకుంటే ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.
నవంబర్ 12న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్, సీపీఐ, విద్యార్థి సంఘాల హెచ్చరికలతో ప్రధాని మోదీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.