Davos: తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్నారు. సీఎం దావోస్ పర్యటనలో ప్రముఖ వీదేశీ సంస్థల సీఈవోలతో సమావేశమవుతున్నారు. దావోస్ పర్యటనలో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ నుంచి ఒప్పందం కుదిరిన కొన్ని గంట్లలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది.
ఇందులో భాగంగానే ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో ఏడు వేల మంది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
Also Read: Jobs In CISF: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. లాస్ట్ డేట్ ఇదే..
కొన్ని గంటల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హెసీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో విజయ్ కుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. హైటెక్ సిటీలో దాదాపు 3.20 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు చర్చలు జరిపారు. దీని ద్వారా కూడా 5వేల మందికి పైగా ఐటీ నిపుణులకు ఉద్యోగం వచ్చే లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందెకెళ్తోంది. ముఖ్యం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రేవంత్ సర్కార్ పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది.
సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.
సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసిందని అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని అన్నారు.
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ పెట్టుబడుల గమ్య స్థానంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందని చెప్పారు.