Kukatpally Incident: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. డెలివరీకి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి వచ్చేసరికి ఇళ్లు అమ్మేసి.. భర్త అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు.
నాలుగేళ్ల శాంతియుత జీవితంలో కలకలం
వివల్లోకి వెళ్తే.. నికిత అనే మహిళ శ్రవణ్ అనే వ్యక్తిని.. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆ సమయంలో నికిత కుటుంబం 48 లక్షల రూపాయల కట్నంగా ఇచ్చారు. ఈ మొత్తంతో పాటు బ్యాంక్ లోన్ తీసుకుని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో.. ఒక అపార్టుమెంటు ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. కొన్ని సంవత్సరాలు దంపతులు ఆ ఇంట్లో నివసించారు.
డెలివరీ తర్వాత మలుపు తిరిగిన జీవితం
తన గర్భధారణ సమయంలో నికిత డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి భర్త శ్రవణ్ వ్యవహారాల్లో మార్పు వచ్చింది. తక్కువగా కాల్ చేయడం, అస్సలు ఇంటికి కూడా వెళ్లడం మానేశాడు. శ్రవణ్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పినా, తాను అక్కడికి వెళ్లినా.. అతను కనిపించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది.
ఊహించని పరిణామం, ఇంట్లో ఇతరులు
ఎన్నాళ్లైన భర్త రావడం లేదని చూసి తానే బంధువులతో కలిసి హైదరాబాద్ వచ్చింది. వాళ్ల ఇంట్లో వేరే వాళ్లు ఉండటం చూసి ఆశ్చర్యానికి గురైంది. మీరెవరని అడిగితే ఇళ్లు కొనుక్కున్నామని చెప్పే సరికి కంగుతింది. ఈ మాట విన్న నికిత ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు.
న్యాయం కోరుతూ బైఠాయింపు
ఏం చేయాలో తెలీక న్యాయం చేయాలంటూ.. ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఇంటి లోన్ కూడా తన పేరుమీదే ఉందని బాధితురాలు చెప్తోంది. చేసేదిలేక కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇల్లు లోన్ ఇప్పటికీ నా పేరుమీద ఉంది. ఆ డాక్యుమెంట్లకు నా సంతకాలు లేవు. అసలు అమ్మకం ఎలా జరిగిందో విచారణ జరగాలి అని ఆమె వాపోతున్నారు.
వివాహితల హక్కులకు గౌరవం ఇవ్వాలి
ఈ సంఘటన మరొకసారి మన సమాజంలో.. మహిళల ఆస్తి హక్కుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. పెళ్లి పేరుతో పెద్ద మొత్తం కట్నంగా తీసుకోవడం, తర్వాత భార్యను మోసం చేయడం.. వంటి ఘటనలు ఇంకా జరుగుతుండటం బాధాకరం. ఈ కేసులో నికితకు న్యాయం జరగాలంటే పోలీసులు, ఆదాయ శాఖ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల సమన్వయం అవసరం. ఆమె అనుమతి లేకుండా ఇల్లు అమ్మకాన్ని ఎలా లీగల్‌గా చేసారో ఆ దారులను వెలికితీయాలి.
Also Read: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. యంగ్ ఇండియా స్కూల్‌కి శంకుస్థాపన
నికిత కథ తనకే కాదు, అనేక మంది మహిళలకు హెచ్చరికగా మారాలి. కుటుంబం, ప్రేమ పేరుతో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆస్తి విషయంలో చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, చట్టం కఠినంగా పనిచేయాలని.. సామాజిక సంస్థలు, ప్రభుత్వ అధికారులు ముందుకురావాలి.