ఈజిప్ట్.. ఈ పేరు వినగానే వెంటనే పిరమిడ్స్ గుర్తుకు వస్తాయి. ఆ పిరమిడ్స్ లో రాజులు, రాజ వంశీయుల మమ్మీలు ఉంటాయి. అంతేకాదు, ఆ దేశంలోని మ్యూజియంలలో ఎంతో మంది ప్రముఖ మమ్మీలు కొలువుదీరి ఉన్నాయి. మన దగ్గర మాదిరిగా అక్కడ ప్రముఖుల మృతదేహాలను కాల్చేవారు కాదు. రసాయన లేపనాలు పూసి చెడిపోకుండా భద్రపరిచే వారు. అలాంటి ఆ దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే, మన దేశంలోనూ సుమారు 6 మమ్మీలు ఉన్నాయి. వాటిలో ఒకటి హైదరాబాద్ లోనే కొలువుదీరి ఉంది. దాని వయసు 2500 ఏళ్లు.
హైదరాబాద్ లో ఉన్న ఈజిప్ట్ మమ్మీ.. అక్కడి యువరాణిది. ఆమె పేరు ప్రిన్సెస్ నిషుహు లేదా నైషు అని పిలుస్తారు. ప్రాచీన ఈజిప్ట్ ఫారో పటాలెమీ VI ఫిలోమెటర్ కుమార్తెదని చెప్తుంటారు. ఆమె చనిపోయిన సమయంలో వయసు 25 సంవత్సరాలు. 1920లో హైదరాబాద్ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కు అల్లుడు నవాబ్ నజీర్ నవాజ్ జంగ్ ఈ మమ్మీని ఈజిప్ట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చి బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లోనే ఆయన ఈ మమ్మీని 1,000 బ్రిటిష్ పౌండ్లకు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత, చివరి నిజాం మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ ఈ మమ్మీని 1930లో తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ మమ్మీ అక్కడే కొలువుదీరి ఉంది. మన దేశంలో ఉన్న 6 ఈజిప్ట్ మమ్మీలలో ఒకటి కాగా, సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక మమ్మీ ఇదే కావడం విశేషం.
నిజానికి ఈ మమ్మీ చాలా వరకు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తుంటారు. 2016లో ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం నుంచి వచ్చిన నిపుణులు దీనిని మరింత చెడిపోకుండా తగిన మరమ్మతులు చేశారు. ప్రస్తుతం దీనిని నైట్రోజన్ చాంబర్ లో ఉంచారు. దీనికి ఆక్సిజన్ తగలకుండా చేయడం మూలంగా చెడిపోకుండా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఈ మమ్మీని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయాలని కోరుతున్నారు. ఇందుకు సుమారు రూ. 85 లక్షలు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మమ్మీ పబ్లిక్ గార్డెన్ లోని తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. దీనిని దీనిని సాధారణ ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం రూ. 20 చెల్లించి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఇంకాస్త ఎక్కుడ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులు చూడాలంటే రూ. 200 ఛార్జ్ చేస్తారు. గురువారం నుంచి మంగళవారం (సోమవారం సెలవు) వరకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 5:00 గంటల వరకు చూసే అవకాశం ఉంటుంది. మీకూ చూడాలని ఉంటే వెళ్లొచ్చు.
Read Also: అక్టోబర్ 29 లోపే సెలవులు తీసుకుని ఎంజాయ్ చేసేయ్యండి.. ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిక!