Formula E Race Case: హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేసు కేసు దర్యాప్తు జోరందుకుంది. ఓ వైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు ఈడీ విచారణకు సిద్ధమైంది. ఇందులోభాగంగా గురువారం హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అంటే గడిచిన పదేళ్లపాటు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారాయన. ఈ కేసులో ఆయన ఏ-3గా ఉన్నారు. నిధుల బదిలీకి సంబందించి ఆయనను ప్రశ్నించనుంది ఈడీ.
ఫార్ములా ఈ కారు రేసు ఆర్గనైజనేషన్ సంస్థతో జరిగిన ఒప్పంద లావాదేవీల గురించి ప్రశ్నించనుంది. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? తొలుత 22 కోట్లు, రెండో విడత 23 కోట్లు చెల్లించాలని రాతపూర్వకంగా ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేదానిపై ప్రశ్నించనుంది. ఇదివుండగా ఈడీ విచారణకు హాజరు కాలేదు బీఎల్ఎన్ రెడ్డి. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని కోరారు. ఈ మేరకు ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి మెయిల్ చేశారాయన. బీఎల్ఎన్ రెడ్డి మెయిల్‌కు రిప్లై ఇచ్చింది ఈడీ. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని బీఎల్ఎన్ రెడ్డికి తెలిపారు.
శుక్రవారం ఈడీ ముందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ రాబోతున్నారు. వీరిద్దరు ఇచ్చిన ఆధారాల ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. ఈ క్రమంలో ఈనెల 7న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే సమన్లు పంపించింది ఈడీ. దీనికి కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఫార్ములా ఈ కారు రేసు కేసు నమోదైన నుంచి ఇప్పటివరకు ఎవరినీ విచారణకు పిలవలేదు ఏసీబీ. పిర్యాదుదారు దాన కిషోర్ నుంచి పూర్తి సమాచారం రికార్డు చేసింది. రేపో మాపో నిందితులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఇంతలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. మరి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా?
ALSO READ: బీఆర్ఎస్ నెక్ట్స్ ఏంటి.. అదే సీన్ రిపీట్
ప్రస్తుతం బిజీగా ఉన్నారని చెప్పి న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విచారణకు వెళ్లకుండా తప్పించుకోవాలన్నది కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి విచారణకు వెళ్లాలా వద్దా అనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారాయన.
ఇదిలావుండగా కేసు నమోదు చేసిన తర్వాత బీఎల్ఎన్ రెడ్డి.. మాజీ మంత్రితో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31న క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా కేటీఆర్ లాయర్ వాదనంతా ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఇరికించినట్లుగా సాగింది.