BRS Party: కారు పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది? ప్రయాణం సాఫీగా సాగేనా? ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి వెళ్లనుందా? 2024 సీన్ రిపీట్ అవుతుందా? బీఆర్ఎస్‌కు ఈ ఏడాదే ఎందుకు కీలకం కాబోతోంది? ఓ వైపు పార్టీ సంస్థాగత ఎన్నికలు.. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. మరోవైపు అవినీతి ఆరోపణల కేసులు. ఇవన్నీ ఈ ఏడాదిలో ఓ కొలిక్కి రానున్నాయా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.
2024 ఏడాది బీఆర్ఎస్‌కు ఊహించని విధంగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్య నేతలు వలసపోవడం, కవిత అరెస్ట్, కేటీఆర్‌పై ఫార్ములా కేసులంతా కారు భారీగా కుదుపులోనయ్యింది. అందుకే కొత్త ఏడాదిలో గులాబీ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే చర్చ సహజంగానే జరుగుతోంది.
కారు పార్టీకి 2025 కూడా అనుకూలంగా లేదంటున్నారు జ్యోతిష్యులు. ఎందుకంటే 2024 ఏడాది ఒకింత సేఫ్‌గా ఉందని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన బాధ తప్పితే మరొకటి లేదంటున్నారు. ఈ ఏడాది కాస్త నిలబడితే కొంతలో కొంత పర్వాలేదని అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.
తొలుత పార్టీ విషయానికొద్దాం. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. కాబోయే అధ్యక్షుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. మరి పెద్దాయన మదిలో ఏమందో ఎవరికి ఎరుక. అధ్యక్ష పీఠంపై కేటీఆర్, కవిత, కొత్త వ్యక్తిని కూర్చోబెడతారా? అనేది తేలనుంది.
ALSO READ: బీఆర్ఎస్ నెక్ట్స్ ఏంటి.. అదే సీన్ రిపీట్
పార్టీ అంతర్గత వ్యవహారాలు తేలిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పంచాయితీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు రానున్నాయి. మరో నెలలో నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
కాలేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఒప్పందాలు, ఫార్ములా కేసు వంటివి ఈ ఏడాదిలో తేలనున్నాయి. గతేడాది వీటిపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కొన్నింటికి సంబంధించి రేపో మాపో ప్రభుత్వానికి నివేదికలు అందనున్నాయి.
పై పరిణామాల నేపథ్యంలో నేతలను కాపాడుకోవడం మరో కీలకమైన అంశం. అధికార పార్టీ విషయం పక్కన బెడితే.. కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది బీజేపీ. ఆ పార్టీ స్పీడ్ పెంచితే కారుకి మరింత డ్యామేజ్ కష్టాలు తప్పవనేది కొందరు నేతల మాట. దీన్ని ఎదుర్కోవడం ఆశామాషీ కాదని అంటున్నారు.
కారు పార్టీతో చోటా మోటా నాయకులు, కేడర్.. ఎటువైపు గాలి వీస్తే అటు వైపు జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. 2025 కూడా కలిసిరాదని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత కమలంతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.