Hyderabad Fuel Supply: హైదరాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనం కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత, నిల్వలు, అలాగే సరఫరా పరిస్థితులపై జిల్లాలో ఉన్న ఏజెన్సీ నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లతో ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాటర్ సప్లై వాహనాలు, ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, అలాగే ఫైర్ వాహానాలకు ఇంధనం కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 3 రోజులలో ఎంత స్టాకుంది? వంటి వివరాలు అందించాలని, వాహనదారుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ లో పెట్రోల్ రోజుకు 8 లక్షల 61 వేల లీటర్లు అవసరం ఉండగా, కొత్త ఇంధనం కలిపి సోమవారం ఒక్కరోజే 11 లక్షల లీటర్ల సరఫరా అయినట్లు కలెక్టర్ కు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే డీజిల్ నాలుగు లక్షల 63 వేల లీటర్లు సరఫరా ఉండగా, సోమవారం ఒక్క రోజే 6 లక్షల 50వేల డీజిల్ ను వాహనదారులు వినియోగించారని వివరించారు. జిల్లాలో కొంత మేరకు కొరత ఏర్పడటం తో సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
చెర్లపల్లి, ఘట్ కేసర్ టెర్మినల్ నిర్వాహకులతో మాట్లాడి జిల్లాలో పెట్రోల్ డీజిల్ ఎక్కువగా అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ట్యాంకర్ వాహనాలు ఎక్కువగా వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వాహనదారులు అవసరం మేరకు ఇంధనం కొనుగోలు చేయాలని, అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో 185 పెట్రోల్ డీజిల్ బంకులు, 69 ఎల్పీజి , 55 ఆటో ఎల్పీజీ బంకులున్నాయని కలెక్టర్ వివరించారు.
గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో బుకింగ్, రీఫిల్లింగ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రెండు సిలిండర్ల కనెక్షన్ కలిగిన వినియోగదారులు డబుల్ బుకింగ్స్ పరిశీలన చేయాలని, ఒక్క సిలిండర్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తూ, అందరికీ కనీస అవసరమైన ఒక సిలిండర్ అందిన తర్వాతే రెండో సిలిండర్ కేటాయించాలని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో డేటా ఆధారంగా బుకింగ్ లను ఎప్పటికప్పుడు పరిశీలించి, అనవసర బుకింగ్స్, దుర్వినియోగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలు, ఎల్పీజీ ఏజెన్సీలకు సూచించారు.
Also Read: జియో, ఎయిర్‌టెల్, BSNL.. రూ.200లోపు బెస్ట్ ప్లాన్స్ ఇవే.. బోలెడన్ని లాభాలు భయ్యా!
సివిల్ సప్లైస్ శాఖ, పోలీస్,రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నిల్వలు , బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయాలు వంటి అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సహాయ సరఫరా అధికారులు ఇంధన అవుట్‌లెట్‌లు, ఎల్‌పీజి గ్యాస్ ఏజెన్సీలను నిశితంగా పర్యవేక్షించి, నిల్వలు, సరఫరా స్థితి వివరాలను తనకు అందించాలని సూచించారు. ఇంధన పంపిణీ కేంద్రాలు,రవాణా వాహనాలు, సిబ్బందికి భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ మరింత పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ప్రజలు అపోహలు నమ్మొద్దని అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని సూచించారు. భయాందోళనలు సృష్టించడం లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రియాంక హెచ్చరించారు.