Ganesh Chaturthi Hyderabad: హైదరాబాద్ నగరమంతా రాత్రి నుంచి వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం కారణంగా నగర వీధులన్నీ నీటితో నిండిపోతున్నాయి. వినాయక చవితి వేడుకలకు ఇది పెద్ద ఆటంకంగా మారింది. మండపాల వద్ద భక్తుల రాకపోకలు ఆగిపోవడం, రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం, మరి కొన్నిచోట్ల చెరువులా మారిన రోడ్లలో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది.
హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్‌కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే రాబోయే గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ అంటే.. సాధారణ వర్షం కాదని, తీవ్ర వర్షం, స్థానిక వరదల పరిస్థితి ఏర్పడే అవకాశమని అర్థం. అందుకే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: TTD: తిరుమల భక్తులు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి బ్రేక్
పూజా కార్యక్రమాలు అంతరాయం
వినాయక చవితి సందర్భంగా నగరంలోని వేలాది మండపాల్లో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ ఈ వర్షం కారణంగా పూజా కార్యక్రమాలు అంతరాయం కలుగుతున్నాయి. నీరు నిలిచిపోవడం వల్ల భక్తులు దేవుడి దగ్గరికి చేరుకోవడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల మండపాలు వరద నీటిలో మునిగిపోయాయి. వర్షపు బీభత్సం కారణంగా పండగ వాతావరణం భక్తులకు ఇబ్బంది కలిగిస్తోంది.
అధికారులు హెచ్చరిక
ప్రజలు ఇళ్ల వద్దనే జాగ్రత్తలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధులను బయటకు తీసుకెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం ఆగే వరకు ఇంట్లోనే భక్తి కార్యక్రమాలు చేసుకోవడం, మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేయడం అవసరమని సూచిస్తున్నారు. మొత్తానికి రాత్రి నుంచి కురుస్తున్న వర్షం హైదరాబాద్‌ను తడిసిముద్ద చేస్తూ, వినాయక చవితి వేడుకలకు అడ్డంకిగా మారింది. ఇంకా కొన్ని గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిస్తోంది.