Sridhar Babu: ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఏకపక్ష ధోరణులపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి ప్రపంచానికి కావాల్సింది యుద్ధాలు, ఆధిపత్యం కాదని.. పరస్పర గౌరవంతో కూడిన చర్చలు, భాగస్వామ్యమే అసలైన పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్న రెండు రోజుల అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచ స్థాయి మేధోమథనానికి భాగ్యనగరం వేదిక కావడం ఎంతో గర్వకారణమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
నెహ్రూ దార్శనికత.. అలీన విధానమే దిక్సూచి
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నాడు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా చీలిపోయినా, నెహ్రూ ఏ కూటమిలో చేరకుండా స్వతంత్రంగా అలీన విధానాన్ని ఎంచుకున్నారని గుర్తుచేశారు. పంచశీల సూత్రాలు, బాండుంగ్ సదస్సు ద్వారా అప్పుడప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశాలకు ఆయన ఒక బలమైన గొంతుకనిచ్చారన్నారు. అలీన విధానం అంటే కేవలం తటస్థంగా ఉండిపోవడం కాదని, వలసవాద వ్యతిరేకతకు, నిరాయుధీకరణకు అండగా నిలబడటమేనని శ్రీధర్ బాబు విశ్లేషించారు.
భిన్నాభిప్రాయాలే ప్రజాస్వామ్యానికి బలం
ప్రజాస్వామ్య సదస్సు అంటే కేవలం ఏకపక్ష గళం వినిపించడం కాదని, భిన్నాభిప్రాయాల మధ్య జరిగే ఆరోగ్యకరమైన చర్చ అని మంత్రి అభిప్రాయపడ్డారు. అధికారం కంటే ప్రజలే కేంద్రంగా ఈ ప్రపంచం మరింత మానవీయంగా మారాలన్నదే తమ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాన ఆశయమని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తు సవాళ్లపై 12 కీలక ప్యానెల్ చర్చలు
రెండు రోజుల పాటు సాగిన ఈ అంతర్జాతీయ సదస్సులో పలు దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు యువత భవిష్యత్తు వంటి సమకాలీన అంశాలపై 12 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలు జరిగాయని మంత్రి వివరించారు. ఈ చర్చలు భవిష్యత్ తరాలకు కొత్త దారి చూపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో- ప్రియుడి వేధింపులకు దళిత యువతి బలి!