Hyderabad Metro Issue: హైదరాబాద్ మెట్రో ట్రైన్ కాసేపు నిలిచి పోయింది. దీనితో మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పడిన హైరామా అంతా ఇంతా కాదు. చివరకు మెట్రో అధికారులు స్పందించడంతో సమస్య పరిష్కారమై, మెట్రో రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగాయి. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లో గురువారం జోరు వాన కురిసింది. ఉదయం నుండి ఎండ ప్రభావం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం నుండి వాతావరణంలో స్వల్ప మార్పు కనిపించింది. కాగా సాయంత్రం ఒక్కసారిగా చిటపట చినుకులతో మొదలైన వర్షం, భారీ వర్షానికి దారి తీసింది. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాలలో వర్ష ప్రభావం అధికంగా కనిపించింది. పలు లోతట్టు ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి.
అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. జిహెచ్ యంసి అధికారులు నాలాల వద్ద నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు.
మెట్రో సేవలకు అంతరాయం.. ఆగిన మెట్రో రైలు
వర్షం కారణంగా హైదరాబాద్ మెట్రో రవాణాకు ఎఫెక్ట్ కనిపించింది. మియాపూర్ నుండి ఎల్బీ నగర్ రూట్‌లో వెళ్లే మెట్రో ట్రైన్ భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ముందు సాధారణంగా మెట్రో ట్రైన్ ఆగిందని ప్రయాణికులు భావించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ప్రయాణికులు గాబరా పడ్డారు.
సాంకేతిక సమస్య కారణంగా మెట్రో రైలు ఆగిందని తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందగా, అదే తీరులో 20 నిమిషాల పాటు మెట్రోలో ప్రయాణికులు కాలం వెళ్లదీసిన పరిస్థితి. దీనితో సమాచారం అందుకున్న మెట్రో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మెట్రో రైలు ద్వారాలు తెరిచారు. అలాగే మెట్రో రైలు రాకపోకలను పునరుద్ధరించారు.
Also Read: Gold Tiffin Box Theft case: నిజాం టిఫిన్ బాక్స్ చోరీ కేసు.. నిందితుడి హాబీ అదో వెరైటీ..
మొత్తం మీద మెట్రో రైలులో గల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడినట్లు తెలపడం విశేషం. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా హైదరాబాద్ మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.