Hussain Sagar Lake: భాగ్యనగరానికి మణిహారం మన హుస్సేన్ సాగర్. బండ్ అందాలు.. నెక్లెస్ రోడ్డు హొయలు.. వాహ్వా.. ఈ సుందర.. సుమనోహర దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. సాయంత్రం అయితే చాలు.. సగం నగరం.. ట్యాంక్ బండ్‌పైనే వాలిపోతోంది. సరదాగా సాగర్ అందాలు చూస్తూ సేదతీరుతోంది. మరి..ఈ అందాల వెనుక కనిపించని అసలైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారిన హుస్సేన్ సాగర్ జలాశయం.
ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సుగా ప్రసిద్ధి చెందిందిన హుస్సేన్ సాగర్. ఈ జలాశయం 1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షాచే ప్రారంభించబడింది. దీని మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం ఏకశిలకు ప్రసిద్ధి చెందింది. హుస్సేన్ సాగర్‌ను ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ మహానగరానికి వెన్నులా నిలుస్తోంది. ఇది ఒకవైపు.. మరోవైపు చూసుకుంటే.. దుర్భేధ్యమైన వాసన, చెత్తాచెదారంతో హుస్సేన్ సాగర్ కంపుకొడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థాలతో సాగర్ విషమయంగా మారింది. ఇక్కడి నీళ్లు తెల్లగా కాదు.. పూర్తిగా పచ్చగా కనిపిస్తాయి. దీనికి కారణం.. రసాయన వ్యర్థాలు, మానవ వ్యర్థాలే.
హుస్సేన్ సాగర్ మొత్తం క్యాచ్‌మెంట్ ఏరియా 240 చరరపు కిలో మీటర్లు ఉంటుంది. హుస్సేన్ సాగర్‌లో 5.7 చదరపు కిలో మీటర్ల వరకు నీరు విస్తరించి ఉంటుంది. సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 4.81 చదరపు కిలో మీటర్లు. అయితే నగరం నడిబొడ్డున ఇంత భారీ సరస్సు ఉన్నా.. దాని వల్ల కలిగే మంచి కంటే చెడే ఎక్కువ. ఇక్కడకు వచ్చే సందర్శకులకు దుర్గంధం స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడ పనిచేసే వారి పరిస్థితి అయితే.. మరీ ఘోరం.
ఇక హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. వ్యర్థాలు తీయడం.. మళ్లీ యథావిధిగా రావడం ఇక్కడ రోజు జరిగే తంతు. సాగర్‌ను శుద్ధి చేసేందుకు గత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసింది. ఆస్ట్రియా, కెనడా వంటి విదేశాల నుంచి సాగర్ ప్రక్షాళనకు ఖరీదైన మిషన్లను రప్పించింది. వందల కోట్లరూపాయలను ఖర్చు చేసింది.. అయినా కూడా అన్నీ సాగర్‌లో పోసిన పాలలో తయారయ్యాయి. 15 ఏళ్లుగా సాగర్ ప్రక్షాళన సాగుతున్నా.. సాధించిన ప్రగతి మాత్రం శూన్యం.
Also Read: కానిస్టేబుల్ కంత్రి పనులు.. ప్రేమ జంటలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ఖాకీ
హుస్సేన్ సాగర్ రెగ్యులర్ మేయింటెనేన్స్ కోసం హెచ్ఎండిఏ ప్రతి నెల దాదాపుగా 56 లక్షలు ఖర్చు చేస్తోంది. జట్టింగ్ మిషన్ల ద్వారా వేలాది లీటర్ల రసాయనాలు సాగర్‌లో స్ప్రే చేస్తున్నారు. నిత్యం వందలాది కార్మికులు చెత్తను తొలగిస్తున్నారు. కానీ ట్యాంక్ బండ్ కంపు మాత్రం మారడం లేదు. ఈ జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతే. ఇంకా చేయాల్సింది కొండంత.