IPOs Investments| ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో పలు కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులను సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆటో విడిభాగాల రంగానికి చెందిన బెల్‌రైజ్ ఇండస్ట్రీస్, టెక్స్‌టైల్ తయారీ రంగంలో ఉన్న రెండు సంస్థలు పబ్లిక్ ఇష్యూలను ప్రకటించాయి. పబ్లిక్ ఇష్యూ వివరాలు, షేర్ల ధరలు, లాట్స్‌కు సంబంధించి రిటైల్ ఇన్వెస్టర్లకు అవసరమైన సమాచారం, అలాగే ఈ సంస్థలు సమీకరించే నిధులను ఏ విధంగా వినియోగించనున్నాయనే అంశాలపై వివరాలు మీ కోసం.
ఆటో విడిభాగాల తయారీ సంస్థ బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న ప్రారంభం కానుంది. మే 23, 2025న ఈ ఇష్యూ ముగియనుంది. ఈ షేర్ విక్రయానికి కంపెనీ రూ.85 నుంచి రూ.90 రేంజ్ వరకు ధర ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఇష్యూలో భాగంగా.. బెల్ రైజ్ కంపెనీ రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ ఇష్యూకు సంబంధించిన యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను ఈ నెల 20న ముందుగానే విక్రయించనుంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 166 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తం నిధుల్లో రూ. 1,618 కోట్లు కంపెనీ అప్పులను తీర్చడానికి ఉపయోగించనుంది. బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ ప్రధానంగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్ తయారీతోపాటు ఇతర ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తోంది. కంపెనీ ఆర్థిక బలం గురించి చెప్పాలంటే డిసెంబర్ 2024 నాటికి కంపెనీపై రుణాలు మొత్తం సుమారు రూ.2,600 కోట్లు.
మరోవైపు, బొరానా వీవ్స్ అనే టెక్స్‌టైల్ తయారీ సంస్థ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమవుతోంది, 22న ముగియనుంది. ఈ ఇష్యూ షేర్లు ధర రేంజ్ రూ. 205 నుంచి రూ. 216గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 67.08 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుందని సమాచారం. ఈ ఇష్యూ ద్వారా రూ. 145 కోట్లు సమీకరించాలనే ఉద్దేశంతో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ఈ నెల 19న జరగనుంది.
Also Read: ఏటిఎంల సంఖ్యను తగ్గించేస్తున్న బ్యాంకులు.. కారణాలు ఇవే..
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 69 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్ నిర్మాణానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అలాగే ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా బొరానా వీవ్స్ గ్రే ఫ్యాబ్రిక్ ఉత్పత్తిని ప్రారంభించనుంది.
ఐటీ షేర్లలో లాభాల్లో
శుక్రవారం నాడు ఐటీ షేర్లలో మదుపర్లు లాభాలు తీసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, లోహ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించగా, చిన్న, మధ్యస్థాయి షేర్లు మెరుగ్గా ప్రదర్శించాయి. రూపాయి విలువ 3 పైసలు తగ్గి 85.57కి చేరింది. ముడి చమురు బ్యారెల్ ధర 64.59 డాలర్లకు చేరి స్వల్ప లాభం నమోదు చేసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండగా, ఐరోపా, అమెరికా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
సూచీలు నష్టాల్లో ముగిసినా, బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఊహించలేనంతగా రూ.2.65 లక్షల కోట్ల మేర పెరిగి రూ.442.84 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 82,330 వద్ద ముగియగా, నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 25,019 వద్ద స్థిరపడింది.
ఐటీ, టెక్, బ్యాంకింగ్ రంగాలు నెగటివ్‌గా ఉండగా, రక్షణ రంగ షేర్లు ఆరో రోజూ లాభాల్లో కొనసాగాయి. పరాస్ డిఫెన్స్, డేటా ప్యాటర్న్స్, మిధానీ వంటి షేర్లు భారీగా పెరిగాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ రూ.595 కోట్ల విలువైన బ్యాలెన్స్‌షీట్‌లో తేడాలు గుర్తించినట్లు తెలిపింది. షేరు ఇంట్రాడేలో పడిపోయి చివరికి స్వల్ప లాభంతో ముగిసింది.