Kadapa District: కడప జిల్లాలో అతడో ఏఆర్ కానిస్టేబుల్. అయితే అతనికి ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే ఫొటోలు తీసి భయపెట్టి అందినకాడికి దోచుకోవడమే అతడి పనిగా పెట్టుకున్నాడు. ఇటీవల అతడి వేధింపులు తాళలేక రాజంపేటలో ఓ బీటెక్ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ ను అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కడప జిల్లా పోలీసులు సస్పెండ్ చేశారు.
కడప ఆర్మ్డ్ విభాగంలో కె. రామ్మోహన్ రెడ్డి (ఏఆర్పీసీ 328) పని చేస్తున్నాడు. తన బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నాడు. అక్కడకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమజంటలను టార్గెట్ చేస్తూ అనిల్ ఫొటోలు తీసి, వారి ఫోన్ నంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడని తెలుస్తోంది. వెంటనే కానిస్టేబుల్ పాలకొండలకు వచ్చి ఫోటోలు చూపి బయపెట్టడంతో పాటు తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి, అందినకాడికి దోచుకునేవాడని సమాచారం. అనంతపురం జిల్లా కు చెందిన బీటెక్ విద్యార్థిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 3 వ తేదీన తోటి స్నేహితులు పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫొటోలు తీయగా, రామ్మోహన్ రెడ్డి వెళ్లి భయపెట్టాడు. దీంతో వారు రూ.4 వేలు ఇచ్చి బయటపడ్డారు. తర్వాత మళ్లీ వేధించడంతో మరో రూ.10 వేలు ఇచ్చుకున్నారు. అయినా ఆశ తీరని కానిస్టేబుల్ ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 5 వ తేదీన ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే సమయంలో రామ్మోహన్ రెడ్డికి ఆమె తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటపడింది.
Also Read: ఊళ్లోకి వచ్చిన సింహాన్ని పట్టుకొని కట్టేసిన గ్రామస్తులు, నెట్టింట వీడియో వైరల్!
యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు కీచకులైన అనిల్ కుమార్ రెడ్డిని, రామ్మోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఇప్పటివరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలింది. ఇలాంటి ఘటనపై యువతులు అప్రమత్తంగా ఉండాలని, అంతే కాకుండా బయపడకుండా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో కడప జిల్లా లో ఏ ఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.