Ganesh Idols: స్వేచ్ఛ బ్యూరో: తయారీ దశలోనే గణేశ్ విగ్రహాల ఎత్తుపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ చెప్పారు. విగ్రహాలను తరలించే సమయంలో..నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. బంజారాహిల్స్ లోని ఐసీసీసీలో బుధవారం గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశమైన సీపీ సజ్జనార్ మాట్లాడుతూ గతంలో గణేశ్ విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బండ్లగూడలో విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎత్తు కారణంగానే పంజగుట్ట ఫ్లై ఓవర్ వద్ద ఓ విగ్రహం ఇరుక్కుపోయిందని చెప్పారు. హైదరాబాద్ లో సాధారణంగా విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తులో ఉంటాయని తెలిపారు. అదే సమయంలో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లే ట్రాలీ ఎత్తు దాదాపు 4 అడుగుల వరకు ఉంటుందన్నారు.
ఈ రెండు కొలతలను పరిగణనలోకి తీసుకుని, విద్యుత్ తీగలకు తగలకుండా 15 అడుగుల లోపు ఎత్తులోనే విగ్రహాలను తయారు చేయించుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రతి మండప నిర్వాహకులకు వివరించి వారిలో అవగాహన కల్పించే బాధ్యతను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకోవాలని కోరారు. విగ్రహాల తయారీదారులతో కూడా ముందుగానే మాట్లాడి, ఎత్తు తక్కువగా ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ఊరేగింపు సాగేటప్పుడు తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు అడ్డువస్తే.. మండపాల సభ్యులు స్వయంగా కర్రలతోనో, ప్లాస్టిక్ పైపులతోనో వాటిని పైకి లేపే ప్రయత్నం చేయడం వల్లే గతంలో ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఏడాది అలాంటి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also read: Minor Driving: రవాణా శాఖలో తెలంగాణ సర్కార్ సంచలన జీవో.. కొత్తగా తెచ్చిన రూల్స్ ఇవే..?
ప్రజల ప్రాణ రక్షణే అత్యంత ముఖ్యమని, పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మరోవైపు, పండుగను సజావుగా నిర్వహించేందుకు నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు చేసిన పలు సూచనలపై సీపీ సానుకూలంగా స్పందించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీపీ (సౌత్ రేంజ్) తఫ్షీర్ ఇక్బాల్, అదనపు డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) నర్సింహా రావుతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాఘవరెడ్డి, శశిధర్, కరోడి మల్, రామరాజు, మహేందర్, బుచ్చిరెడ్డి, రమేష్, వైకుంఠం, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
Also read: Harish Rao: నీకు కేసీఆర్ అవసరమా.. నేను చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు ఓపెన్ చాలెంజ్!