Harish Rao: స్వేచ్ఛ బ్యూరో:కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు.. నాకు ఒక్క మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు.. నీళ్లు ఎలా తేవాలో నేను చూపిస్తా.. నీళ్లు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా’ అని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాస్తవాలను, ఆధారాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో ప్రపంచమంతా చుక్క చుక్క నీటిని ఒడిసిపడుతుంటే, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా గోదావరి జలాలను ప్రభుత్వం వృధాగా కిందికి జారవిడుస్తున్నదని మండిపడ్డారు.
గోదావరిలో సమ్మక్క బ్యారేజి దగ్గర లక్ష క్యూసెక్కుల వరద ఉంటే, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా కేవలం 2,542 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అవకాశం ఉన్నా నీటిని ఎందుకు పూర్తిస్థాయిలో లిఫ్ట్ చేయడం లేదని నిలదీశారు. సమ్మక్క బ్యారేజి వద్ద 76 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉన్నాయని, 71 మీటర్ల వద్దే దేవాదుల మోటార్లు నడపొచ్చు.. అయినా మోటార్లు ఆన్ చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సే.. బ్యారేజ్ ఏమీ కూలిపోలేదు కదా? అని ప్రశ్నించారు.
గోదావరిలో ఇంత వరద ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయి ఎడారిలా మారుతున్నాయని, ఇద్దరు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపరు? సమ్మక్క బ్యారేజిపై చర్చకు అసెంబ్లీ పెడతారా? నేను సిద్ధం అని సవాల్ చేశారు. తుమ్మిడిహెట్టికి కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రాలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా సీడబ్ల్యూసీ అనుమతి ఎందుకు రాలేదు? 8 ఏండ్లలో అక్కడ తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? అని నిలదీశారు. తుమ్మిడిహెట్టికి 6000 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, పనులు జరగకుండానే సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 2328 కోట్లను మెక్కారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read: Homemade Wine: యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. ఏకంగా 377 లీటర్లు, చివరికి ఎలా దొరికిపోయారంటే?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు మూడేళ్లు అవుతూందని తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రకు వెళ్లి ఎన్నిసార్లు మాట్లాడారు? మీకు తెలంగాణపై ప్రేమ లేదు, చేతలు శూన్యం అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీళ్లు లేవని, కేవలం 102 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని సీడబ్ల్యూసీ స్వయంగా లేఖ రాసిందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చినట్లు ఒక్క ఆధారం, ఒక్క లెటర్ బయటపెట్టినా.. నేను ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ డబ్ల్యూఏపీసీఓఎస్ నీటి లభ్యతను అధ్యయనం చేసి మేడిగడ్డను సూచించిందన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉందని, బ్యారేజ్ కట్టొచ్చని చెప్పింది.. అయితే మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకుపోలేము, మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయని సూచించింది తప్ప ప్రాజెక్టే కట్టొద్దని చెప్పలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్.. మొత్తం 18 కేంద్ర సంస్థల నుంచి దీనికి అనుమతులు వచ్చాయన్నారు. ప్రాజెక్టు నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగిందని, ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగిందన్నారు.
కొడంగల్ – నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గతంలో 1400 కోట్లతో జీవో ఇస్తే.. ఇప్పుడు దాన్ని 4350 కోట్లకు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరమే లేకుంటే మూసీకి నీళ్లు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పిల్లర్లు కుంగితే, మీ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సుంకిశాల కూలిపోయింది, ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిందని మండిపడ్డారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ కొట్టుకుపోయాయని అంటున్నారని, ప్రాజెక్టులు కొట్టుకుపోతే మళ్లీ సుందిళ్లకు నీటిని ఎలా తరలిస్తారు? దీన్నిబట్టే చిత్తశుద్ధి లేదని, కేవలం బద్నామ్ చేయడమే మీ లక్ష్యమని స్పష్టమవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 31 నెలలు కావొస్తోందని, ఇప్పటివరకు టెస్టులే చేయలేదు, రిపేర్లు ఎప్పుడు చేస్తావు అని ప్రశ్నించారు. ఇంకో ఏడాది అయితే కాంగ్రెస్ గద్దె దిగడం ఖాయం, కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత మేడిగడ్డ బరాబర్ రిపేర్ చేసి తెలంగాణకు నీళ్లు అందిస్తామన్నారు. మేడిగడ్డ దగ్గర 7.5 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయని, ఆ నీటిని ఒడిసి పడితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం చేయొచ్చు.. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని నిలదీశారు.
Also Read: NIA Raids: ఎన్ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?