CP Sajjanar Warning: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తూ పండగను ఎంజాయ్ చేస్తారు. అయితే.. కొందరి ఇళ్లలో ఈ పండగ ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోతోంది. దీనికి గల కారణం మనం ఉపయోగించే మాంజా. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దొంగ చాటుగా ఈ మాంజా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమ విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతూ హైదరాబాద్ నగర పోలీసులు.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రంగంలోకి దిగారు.
హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనా మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా సౌత్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో భారీగా చైనా మాంజా నిల్వలు బయటపడినట్లు సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజా కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, గాలిపటాలు ఎగరేసిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలు భద్రత దృష్ట్యా చైనా మాంజాను పూర్తిగా నివారించి, కేవలం సాధారణ నూలు దారంతో చేసిన మాంజానే ఉపయోగించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చైనా మాంజా వల్ల పక్షులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన గుర్తుచేశారు.
గత కొన్ని రోజులుగా పోలీసులు టాస్క్‌ఫోర్స్‌తో కలిసి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి ఆర్డర్ల ద్వారా చైనా మాంజాను తెప్పిస్తున్న దుకాణదారులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్‌లో మాత్రమే 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్ట్ చేశారు.
ALSO READ: బైకర్‌ను తప్పించబోయి.. కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
చైనా మాంజా విషయంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం
చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా, పతంగులు ఎగరేసిన వాళ్లపై కేసులు పెడతాం
పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం
చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది
– సీపీ సజ్జనార్ https://t.co/A26JEQQxXX pic.twitter.com/IFzyCQuv0X
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026