ఈ రోజు ఆఫీసుకు వెళ్లారా? అయితే, వెంటనే పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్లిపోండి. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని మీ బాస్‌ను అడగండి. అప్పటికీ పర్మిషన్ ఇవ్వకపోతే.. ఇదిగో తాజాగా సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్‌ను చూపించండి. మంగళవారం హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎలాంటి వానా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. దీంతో ఉద్యోగులు కూడా ఆఫీసులకు చేరుకున్నారు. అయితే.. వెళ్లేప్పుడు మాత్రం వర్షం.. ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకొనే అవకాశాలున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షాలు దంచికొడతాయని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. వీలైతే త్వరగా ఆఫీసుల నుంచి లాగౌట్ అవ్వాలని సూచించారు. అలాగే, ఉద్యోగులకు ఆ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బెటర్ అని కూడా తెలిపారు. ముఖ్యంగా ఈవినింగ్ షిఫ్ట్ కోసం ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల సేఫ్టీ కోసం ఈ సదుపాయం కల్పించాలన్నారు. లేకపోతే వర్షం, ట్రాఫిక్ జామ్స్, వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి.. మీకు ఆ సదుపాయం ఉంటే వెంటనే ఇప్పుడే లాగౌట్ అయ్యి ఇళ్లకు వెళ్లండి.
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 12, 2025
14, 15 తేదీల్లో కుండపోత.. భారీ వరద ముప్పు
తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. అల్పపీడనం ప్రభావం వల్ల మంగళవారం(ఆగస్టు 12), బుధవారం (ఆగస్టు 13) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తనుంది. ఈ వర్షాలు మరో నాలుగురోజులపాటు కొనసాగుతాయి. కాబట్టి లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సుమారు 150 నుంచి 200 mm మోతాదులో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆగస్టు 14, 15 తేదీల్లో భారీ వరదలకు అవకాశం ఉంది. హైదరాబాద్ సెంట్రల్, వెస్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా 14వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 70 నుంచి 120 mm వర్షపాతం నమొదుకావచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో నాలాలు భారీస్థాయిలో పొంగిపొర్ల వచ్చని, ట్రాఫిక్ జామ్ సమస్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. ఈ నాలుగు రోజులు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.
Also Read: హైదరాబాద్ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?