హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 27వ తేదీ ఉదయం నుంచి 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రేపు ఉదయం నుంచి నీటి సరఫరా బంద్..
కృష్ణా ఫేజ్-1 పథకంలో భాగంగా.. మెట్రోపాలిటన్ ప్రాంతానికి నీటిని సరఫరా చేసే 700 మి.మీ వ్యాసం కలిగిన ఎంఎస్ పైప్‌లైన్‌కు సర్జ్ ట్యాంక్ వద్ద లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టేందుకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనుల కారణంగా డిసెంబర్ 27వ తేదీ (శనివారం) ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 28వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు.
ప్రభావిత ప్రాంతాలివే…
నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని ప్రధాన రిజర్వాయర్ల పరిధిలో ఈ అంతరాయం కలగనుంది. ముఖ్యంగా:
మీర్ ఆలం, కిషన్ బాగ్, మోఘల్‌పురా, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, జహానుమా ప్రాంతాలు.
సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పురా.
నారాయణగూడ, బోగులకుంట, ఆదిక్‌మెట్, శివం రోడ్డు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
చిలకలగూడ, అలీయాబాద్, రియాసత్ నగర్ రిజర్వాయర్లు.
దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, హార్డ్‌వేర్ పార్క్, జల్పల్లి, తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ మరియు మన్నెగూడ పరిసర ప్రాంతాలు.
మరమ్మతు పనుల దృష్ట్యా దాదాపు ఒకటిన్నర రోజు పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నందున, పైన పేర్కొన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి సూచించింది. వినియోగదారులు తమకు అవసరమైన నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, సరఫరా పునరుద్ధరించే వరకు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని కోరింది.
మరమ్మతులు పూర్తయిన వెంటనే యధావిధిగా నీటి సరఫరాను కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నగర ప్రజలు ఎదురయ్యే ఈ అసౌకర్యానికి సహకరించాలని కోరారు.
ALSO READ: CP Sajjanar: న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు: సజ్జనార్